AP Weather Report: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత తారస్థాయికి చేరుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పెద్దయెత్తున ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న హెచ్చరికల దృష్ట్యా ప్రజలు జాగ్రత్త ఉండాలని సూచిస్తోంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారింది. ప్రస్తుతం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా కదులుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్ కు నైరుతిగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంపై వాయుగుండ ప్రభావం ఉంటుందా..?: క్రమంగా ఇది మరింత ఆగ్నేయ దిశగా కదులుతూ బంగ్లాదేశ్ - మయన్మార్ వైపు పయనిస్తుందని అంచనా చేసింది. ఈ సాయంత్రానికి ఇది మరింత బలపడి తుపానుగా మారనున్నట్టు ఐఎండీ తెలియజేసింది. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నానికి బంగ్లాదేశ్ - మయన్మార్ తీరాల మధ్యలో కాక్స్ బజార్ సమీపంలో తుఫాను తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీరాన్ని దాటే సమయంలో తుపాను గాలుల వేగం గంటకు 130 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం తీవ్రవాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పడబోదని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది.
ఉష్ణ గాలుల ప్రభావం: అయితే కోస్తాంధ్ర, రాయలసీమపై ఉన్న తేమగాలులు తీవ్రవాయుగుండం లాగేస్తుండటంతో వాయువ్య భారత్ నుంచి ఉష్ణగాలులు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయనున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాయువ్య భారత్‌లోని రాజస్థాన్, గుజరాత్ , విదర్భ, తెలంగాణా మీదుగా రాష్ట్రానికి ఉష్ణగాలుల వీయనున్నట్టు తెలిపింది. ఉష్ణగాలుల ప్రభావంతో రాగల 4-5 రోజుల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్టంగా 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశముంటుదని అంచనా వేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమల్లో 41-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలంటే.. ప్రతి రోజు అందరూ 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి.. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగాలని.. వీటివల్ల ఎండదెబ్బ తగలకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తలకు టోపి, కాటన్‌తో తయారు చేసిన తెల్లని వస్త్రాలు ధరించాలని. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త అవసరం.
ఇవీ చదవండి: