గుంటూరు జిల్లాలోని కొండవీడుకోట ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. కొండవీటి రెడ్డి రాజుల పాలన, ఈ ప్రాంతం ప్రత్యేకతను భవిష్యత్తు తరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గుంటూరులో కొండవీడు చరిత్ర వ్యాసాల గ్రంథాన్ని సుచరిత ఆదివారం ఆవిష్కరించారు.
రెడ్డి రాజుల పరిపాలనలో కొండవీడు గొప్పగా విరాజిల్లిందన్న హోం మంత్రి... వారి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో లేకపోవడం బాధాకరమని అన్నారు. మరోవైపు అమీనాబాద్ నుంచి కొండవీడుకు రోడ్డు నిర్మించే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తామని సుచరిత చెప్పారు. ఎమ్మెల్యే రజని, కలెక్టర్ శామ్యూల్, మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.