గుంటూరు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలంలోని చెన్నాయపాలెం, వేమవరం వద్ద ఉన్న సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు శాశ్వత ప్రాతిపదికన నీటి సరఫరాకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఐదేళ్ల కాలానికి ఇచ్చిన నీటి సరఫరా ఉత్తర్వులను సవరిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
కృష్ణా నది నుంచి 0.689 టీఎంసీల అదనపు జలాలను రుతుపవనాల సీజన్ లో సరఫరా చేసేందుకు వీలుగా గత ఏడాది డిసెంబరు 3 తేదీన ప్రభుత్వం సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ ఐదేళ్లకాలానికి మాత్రమే నీటిని తీసుకునేందుకు పరిమితం చేస్తూ 2019 డిసెంబరు 3 తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. రుతుపవనాల సమయంలో కృష్ణా నది వరద జలాల నుంచి ఏడాదికి 2.19 క్యూసెక్కులు లేదా 0.689 టీఎంసీల నీటిని తీసుకునే ప్రాతిపదికన ఉత్తర్వులు ఇచ్చారు. వెయ్యి గ్యాలన్లకు 5.5 రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.