GARMA SABHALU: రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తజోన్‌ను అమరావతి ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరు మండలంలోని 14, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. అనంతవరంలో తొలి గ్రామ సభ జరగ్గా....R-5 జోన్ వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయినిపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, దొండపాడు, వెలగపూడి, మల్కాపురం, ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, వెంకటపాలెం, నెక్కల్లు గ్రామాల్లోనూ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, కురగల్లు, నీరుకొండ గ్రామాల్లోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టారు. రాజధాని కోసం భూములిస్తే CRDA చట్టం ప్రకారం అభివృద్ధి చేయకుండా ఇష్టారాజ్యంగా మార్చటం ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వం అన్నిచోట్ల ఒకేసారి గ్రామసభలు నిర్వహించినా....రాజధాని ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. శుక్రవారం రాత్రి షెడ్యూల్ ప్రకటించినప్పటికీ అన్నిచోట్లా ప్రజలు గ్రామసభలకు హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వం మొదటి నుంచీ అమరావతి పట్ల వ్యతిరేక ధోరణితో ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. అమరావతి కార్పొరేషన్ పేరిట ఓసారి, అమరావతి మున్సిపాలిటి పేరిట మరోసారి ఇక్కడి ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైందన్నారు. ఇప్పుడు సీఆర్డీఏ చట్టాన్ని సవరించి పేదలకు ఇళ్ల స్థలాల ఇస్తామనటం... ఇతర ప్రాంతాల వారికి అమరావతి రైతులకు మధ్య గొడవలు పెట్టేందుకేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తం 19 గ్రామాల్లో సభలు నిర్వహించగా... అన్నిచోట్ల ప్రజలు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని నివేదికగా రూపొందించి స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా హైకోర్టుకు, సీఆర్డీఏ ఉన్నతాధికారులకు, గుంటూరు జిల్లా కలెక్టర్ కు అందజేస్తామన్నారు.
గ్రామసభలు అన్నిచోట్లా దాదాపు 10 నిమిషాల లోపే ముగిశాయి. రాయపూడి, వెంకటపాలెంలో మాత్రమే గ్రామసభలు గంటకు పైగా జరిగాయి. అక్కడ రైతులు అధికారులను నిలదీయటంతో ఆలస్యమైంది. రాయపూడిలో వైకాపా సానుభూతిపరుడిని పక్కన కూర్చోబెట్టుకుని అధికారులు గ్రామసభ నిర్వహించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బృహత్ ప్రణాళికకు భిన్నంగా ప్రభుత్వం వెళ్తున్న విషయం అధికారులు ఎందుకు చెప్పటం లేదని మహిళలు మండిపడ్డారు.
ఇవీ చదవండి: