Two Votes for One Person in YSRCP Leaders Families: వైసీపీ వారైతే చాలు ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లైనా ఉండొచ్చన్నట్లు ఉంది రాష్ట్రంలో వ్యవహారం. ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు, పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారులు, వాలంటీర్లు.. ఇలా అందరికీ ఒకటికి మించి ఓట్లున్నా.. ఎన్నికల సంఘానికి పట్టడం లేదు. నాలుగేళ్లుగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపణ అవుతున్నా.. ఎన్నికల అధికారులు ఎందుకు కళ్లకు గంతలు కట్టుకున్నారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
రాష్ట్రంలో ఒకటికి మించి ఓట్లున్న ఉదంతాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. వాటిని జాబితా నుంచి తొలగించాల్సిన ఎన్నికల సంఘం.. అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు మాత్రం సిద్ధమైంది. వైసీపీ నాయకులు నాలుగేళ్లుగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపణ అవుతున్నా.. ఎన్నికల సంఘం ఎందుకు కళ్లకు గంతలు కట్టుకుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
Irregularities in Voter List దుకాణానికి ఇంటి నంబర్.. 100కి పైగా ఓట్లు! నంబరే లేని ఇంట్లో ఏకంగా 280..
ఒకే వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉంటే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించి తొలగిస్తున్నామని.. ఎన్నికల సంఘం చెబుతోంది. 2002 నుంచి 2023 మధ్య 10 లక్షల ఓట్లు జాబితా నుంచి తీసివేసినట్లు తెలిపింది. కానీ రాష్ట్రంలో ఇటీవల వైసీపీ నాయకుల డబ్లింగ్ ఓట్లు ఎన్నో వెలుగు చూశాయి. వాటిని సాఫ్ట్‌వేర్ ఎందుకు పసిగట్టలేకపోతోందన్నది ఇప్పడు ప్రశ్నగా మిగిలింది.
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి భార్య కొలుసు లక్ష్మీకమలకు తాడిగడపలోని 98వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఒక ఓటు.. ఉయ్యూరులోని 248వ నంబరు పోలింగ్ కేంద్రంలో మరో ఓటు ఉన్నాయి. ఒక చోట కమలాలక్ష్మి, మరోచోట లక్ష్మీకమల అనే పేర్లతో ఓట్లు ఉన్నాయి. ఇలాంటి ఉదంతాలే మిగతా చోట్ల ఉన్నాయా అనే దానిపై ఎన్నికల సంఘం ఎందుకు విచారణ జరపడం లేదన్నది ప్రశ్న.
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ, సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు ఆ నియోజకవర్గం పరిధిలోని కండ్లకుంటలోని 114వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఒక ఓటు, మాచర్లలోని 67వ నంబరు పోలింగ్ కేంద్రంలో మరో ఓటు ఉన్నట్లు బయటపడింది. ఎమ్మెల్యే బావమరుదులు, వారి కుటుంబసభ్యులకూ ఇలాగే రెండేసి ఓట్లున్నాయి. ఈ నియోజకవర్గంలో 2వేల మందికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్వగ్రామమైన తోపుదుర్తిలో 476 మందికి ఒకటికి మించి ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డికి అనంతపురంలోని 165వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఒకటి.. తోపుదుర్తిలోని 36వ నంబరు పోలింగ్ కేంద్రంలో మరొక ఓటుంది. నియోజకవర్గంలో దాదాపు 12వేల డబ్లింగ్ ఓట్లు ఉన్నట్లు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, వాలంటీర్లు, వారి కుటుంబసభ్యుల పేరుతో ఒక్కొక్కరికీ రెండుమూడేసి ఓట్లున్నాయి. రాష్ట్రంలో అన్నిచోట్లా ఇలాంటి ఉదంతాలు ఎన్నో బయటపడుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందన్నది తెలియడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. అక్రమాలను గుర్తించి ఓట్లను జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఇతర ఎన్నికల అధికారులకు లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ నాలుగుసార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం అయిదో సవరణ జరుగుతోంది. అయినా ఇప్పటికీ జాబితాలో రెండేసి ఓట్లు ఎలా ఉన్నాయన్నది ప్రశ్న. ఈ నాలుగేళ్లలో పలుమార్లు బూత్‌స్థాయి అధికారులు ఇంటింటి తనిఖీలు చేసుంటారు. వారెందుకు వీటిని గుర్తించలేదు. గుర్తిస్తే ఎందుకు తొలగించలేదు? అలా తొలగించని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క ఓటు తేడాతో ఎన్నికల ఫలితాలు తారుమారైపోతాయే.. అలాంటిది లక్షలసంఖ్యలో డబ్లింగ్ ఓట్లు కొనసాగుతుంటే.. వాటిని తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.