గుంటూరు నుంచి గుజరాత్ రాష్ట్రానికి.. లిక్విడ్ గంజాయి(Liquid ganjai) తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3లక్షల విలువ చేసే లిక్విడ్ గంజాయి బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు.. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. చెడు వ్యవసానాలకు బానిసైన నిందితులు నందగోపాల్, పఠాన్ అబ్దుల్.. సునాయాసంగా డబ్బులు సంపాదించాలని ఈ మార్గం ఎంచుకున్నట్లు ఎస్పీ వివరించారు. విశాఖ నుంచి లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసి.. దానిని అధిక ధరకు గుజరాత్‌లోని వడోదర పట్టణానికి తరలిస్తున్న క్రమంలో.. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
చెడు వ్యవసానాలకు బానిసై..
గుంటూరు శారద కాలనీకి చెందిన ఇళయదత్తు నందగోపాల్.. గ్యాస్ సిలిండర్లు నింపుతూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యవసానాలకు బానిసైన గోపాల్, అదే ప్రాంతంలో ఉండే పఠాన్ అబ్దుల్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు కలిసి సునాయాసంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయంచుకున్నారు. గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. గంజాయి ఎక్కడ దొరుకుతుంది.. ఎవరు సరఫరా చేస్తారని వివరాలు తెలుసుకున్నారు. గంజాయి రవాణా చేసే ముఠాతో చేతులు కలిపారు.
విశాఖలో కొనుగోలు చేసి..
విశాఖ జిల్లాలోని చింతపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసుకుని వచ్చారు. దానిని అధిక ధరకు అమ్మాలని నిర్ణయించి.. గుజరాత్‌లోని వడోదర పట్టణానికి చెందిన వారితో బేరం కుదుర్చుకున్నారు. అనుకున్న విధంగా గంజాయి సరఫరా చేయడానికి.. విజయవాడ వెళ్లి అక్కడనుంచి రైలులో గుజరాత్ వెళ్లడానికి వచ్చి గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళ్లారు.
అనుమానం రాకుండా..
సమాచారం అందుకున్న పాత గుంటూరు పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి లిక్విడ్ బాటిళ్లను.. ఆయుర్వేద మందు డబ్బాలను పోలిన విధంగా తయారుచేసి తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. వీరికి ఇంత పెట్టుబడి ఎలా వచ్చింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: