Traffic challan scam in AP: ఏపీలో ట్రాఫిక్ చలానాల కుంభకోణం తీగ లాగితే.. మాజీ డీజీపీ అల్లుడి డొంక కదిలింది. సామాన్యులు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తే.. వెంటనే స్పందించి చలానా విధించే అధికారులు.. తమ డిపార్ట్మెంట్లో కోట్లాది రూపాయలు పక్కదారి పడుతుంటే మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోయారానే విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ.. ఎట్టకేలకూ.. చలానాల అక్రమాలపై గుంటూరు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు మీడియాకు వివరాలు తెలిపారు.
ఐజీ పాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ-చలానా కుంభకోణంలో 36.53 కోట్ల రూపాయలు దుర్వినియోగం గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ నిధుల మళ్లింపు విషయాన్ని సెప్టెంబరులో తిరుపతి యూనిట్‌లో గుర్తించామని తెలిపారు. 100 కోట్ల రూపాయల ఆదాయానికి గాను 36.53కోట్ల రూపాయలు నగదు డీజీ ఖాతాకు జమకాలేదన్నారు. కొమ్మిరెడ్డి అవినాష్‌కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు డబ్బంతా మళ్లించారని ఐజీ పేర్కొన్నారు. ఈ మేరకూ వాహనదారులు చెల్లించిన సొమ్ము పక్కదారి పట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.
'హెల్మెట్ పెట్టుకోలేదు.. రూ.1,000 ఫైన్ కట్టు'.. కారు ఓనర్‌కు పోలీసుల నోటీస్
చలానా చెల్లింపుల విషయంలో శాఖాపరంగా ఆడిట్ నిర్వహణ లోపం ఉందని.. నగదు చెల్లింపుల్లో ఇప్పటివరకూ రూ. 36కోట్ల 53 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని గుంటూరు ఐజీ పాలరాజు వెల్లడించారు. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని తెలిపారు. అవినాష్‌కు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థ ఆస్తులను గుర్తించి.. వాటి క్రయవిక్రయాలకు తావులేకుండా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు లేఖలు రాశామన్నారు. ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి అపరాధ రుసుం ఇ-చలానాల రూపంలో డీజీ ఖాతాకు నాలుగు పేమెంట్ గేట్‌వేల నుంచి అవుతోందని... ఇందులో డేటా ఎవాల్వ్ సంస్థకు చెందిన రేజర్ పే ఖాతా నుంచి డీజీ ఖాతాకు నగదు జమయ్యేలా ఒప్పందం జరిగినట్లు తెలియజేశారు.
అయితే, సాఫ్ట్‌వేర్‌లో రేజర్ పే యాప్‌ను క్లోనింగ్ చేసి.. రేజర్ పీఈ యాప్‌ను రూపొందించి ఆ సొమ్ము తమ సొంత ఖాతాకు జమయ్యేలా అక్రమానికి పాల్పడినట్లు వివరించారు. ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి డేటా సొల్యూషన్స్ నిర్వాహకుడు అవినాష్‌ను సంజాయిషీ అడిగినట్లు వెల్లడించారు. డేటా సొల్యూషన్స్ ప్రతినిధి రాజశేఖర్‌ను ప్రశ్నించామని.. సరైన సమాచారం ఇవ్వకుండా అవినాష్ కాలయాపన చేశారని ఐజీ వివరించారు. రాజశేఖర్‌ను అరెస్టు చేసి విచారణ జరపగా.. నిధులు దుర్వినియోగం చేసినట్టు నిందితుడు అంగీకరించారని స్పష్టం చేశారు. అవినాష్ ఆస్తుల విషయమై సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశామని, ఆస్తుల క్రయవిక్రయాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
Traffic Pending Challans: ఆన్లైన్లో చలానా చెల్లింపులు.... దెబ్బకి సర్వర్ హ్యాంగ్