గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలంలోని గుత్తికొండలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ముగ్గురు పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు హైరానా పడ్డారు. వారి కోసం అన్ని ప్రాంతాలోనూ వెదికారు. ఇళ్లకు సమీపంలోని ఓ రేకుల షెడ్డులో పడుకుని నిద్రించి రాత్రి 8గంటల సమయంలో ఇంటికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామానికి చెందిన నలబోలు శ్రీనివాసరావు కుమారుడు సాయి(6), నలబోలు వెంకటేష్ కుమారుడు హర్షవర్థన్ (6), నలబోలు రామారావు కుమారుడు ఉదయ్‌మోహన్(6) మధ్యాహ్నం దాకా వారి ఇంటి పరిసరాల బయట ఆడుకున్నారు. అనంతరం కనిపించలేదు. పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఉదయాన్నే వారు పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం తర్వాత ఇళ్లకు వచ్చారు. ఆ సమయంలో ఇళ్ల దగ్గర పిల్లలు కనిపించకపోవడంతో గ్రామంలో వారి జాడ కోసం అన్ని ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 8గంటల సమయంలో ఇళ్ల పక్కనే ఉన్న రేకుల షెడ్డు నుంచి పిల్లలు రావడంతో తల్లిదండ్రులు కుదుటపడ్డారు. ఆరా తీస్తే... నిద్రపోయామని... మెలుకువ రాగానే ఇంటికి వచ్చామని పిల్లలు చెప్పడంతో అక్కడి వారంతా ఫక్కున నవ్వారు..
ఇదీ చదవండి: