రాజధాని రైతుల పోరాటానికి తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చంద్రబాబు ఇప్పటికే మూడు పర్యాయాలు రాజధాని ప్రాంతంలో పర్యటించి దీక్ష చేపట్టిన రైతులకు ధైర్యం చెప్పారు. భాజపా, కాంగ్రెస్, వామపక్షాల నేతలు సైతం చురుగ్గా రైతు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. వెంకటపాలెం, మందడంలో చంద్రబాబు పర్యటించి చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించారు. నివాళులు ఆర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసులు దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించారు. మందడంలో మృతి చెందిన గోవిందు కుటుంబీకులను కలిసి ధైర్యం చెప్పారు. అతని చిత్రపటానికి నివాళులు అర్పించారు.
దొండపాడులో మృతిచెందిన కొమ్మినేని మల్లికార్జునరావు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. కుటుంబీకులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. రాజధానిని అమరావతిని తరలిస్తారనే మనస్తాపంతో చనిపోయిన మల్లికార్జునరావు వైకాపా కార్యకర్తగా పనిచేశారని....ఓటేసి గెలిపించిన వారినే మోసం చేయడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు. వైకాపా పత్రికలో మల్లికార్జునరావు పేరు తప్పుగా రాశారని....ఆ కుటుంబంపై నీచమైన విమర్శలు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య పోరాటం కోసం నాడు ఆభరణాలు, ఆస్తులు ఇచ్చినట్లే... రాజధాని రైతుల కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని చెప్పారు. అమరావతిని కాపాడుకునే వారి పోరాటానికి తెలుగుదేశం వెన్నంటి నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
మందడంలో రైతుల చేస్తున్న నిరసనకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన చేసిన తమపై పోలీసులు అన్యాయంగా దౌర్జన్యం చేశారని మహిళలు గల్లాకు ఫిర్యాదు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులు, మహిళల్ని కించపరిచే వారంతా దీక్షలు చూసి సిగ్గుపడాలని జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో రాజధాని అంశంపై గట్టిగా పోరాడతామని హామీ ఇచ్చారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ వెంకటపాలెంలో చనిపోయిన రైతు కూలీ వెంకటేశ్వరరావు భౌతికగాయానికి అమరావతి ఐకాస నివాళులు అర్పించింది. రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆర్ధికసాయం అందించి..అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీచదవండిమీ నిర్ణయంతో వైకాపా కార్యకర్త గుండె ఆగింది: చంద్రబాబు