High Court on GO 1: రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సమావేశాలు, రోడ్డుషోలను కట్టడి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి 2న తీసుకొచ్చిన జీవో 1ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై 2023 జనవరి24న లోతైన విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది.
రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసం ప్రభుత్వం జీవో1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్ నేత గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు, ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.
పోలీసు చట్టం సెక్షన్ 30 ప్రకారం ‘కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి, ప్రత్యేక పరిస్థితులుంటే నిరాకరించండి’ అని చెబుతోందన్నారు. జీవో 1 అందుకు భిన్నంగా ‘అనుమతి నిరాకరించండి, ప్రత్యేక పరిస్థితులుంటేనే అనుమతించండి’ అని చెబుతోందన్నారు. ప్రతిపక్షాలు రహదారులపై నిర్వహించే కార్యక్రమాలను జీవో 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. అయితే నేడు హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రుషికొండ అక్రమ తవ్వకాలపై విచారణ జూన్‌కు వాయిదా: విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జూన్ 14కు వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్టు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ, పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్లో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్నందున ప్రస్తుతం ఈ వ్యాజ్యాలపై విచారణ చేసి తీర్పును రిజర్వు చేసే పరిస్థితి లేదంది. సెలవుల తర్వాత వింటామంటూ జూన్14కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: