Amaravati farmers massive protest : అమరావతిని నాశనం చేయొద్దంటూ రాజధాని రైతులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆర్-5 జోన్‌లో పట్టాల పంపిణీ పేరిట మాస్టర్‌ప్లాన్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు ఆపాలంటూ... నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం ఏనాడూ అమరావతికి రాని ముఖ్యమంత్రి... వినాశనానికి మాత్రం ఉత్సాహంగా వచ్చారని రైతులు మండిపడుతున్నారు. కుట్రపూరిత చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఈ ప్రభుత్వ పతనానికి ఇవాళే పునాది పడిందని ఆక్రోశించారు.
రాజధాని వ్యాప్తంగా.. అమరావతిలో ఆర్ -5 జోన్ పేరిట ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా రాజధాని రైతులు పోరుబాట పట్టారు. పట్టాల పంపిణీకి నిరసనగా రాజధాని వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిబిరాలతో పాటు ఇళ్లు, దుకాణాలు, వాహనాలపై నల్ల బెలూన్లు ఎగుర వేశారు. చాలామంది రైతులు నల్ల దుస్తులు ధరించి, కళ్లకు గంతలు కట్టుకుని దీక్షా శిబిరాల్లో పాల్గొన్నారు. తమకు ఉరి వేయవద్దంటూ ఉరితాళ్లు శిబిరాల్లో కట్టి నిరసన తెలిపారు. వినాశకర ధోరణితో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని ప్రకటించారు.
అన్ని గ్రామాల్లో... వెలగపూడి, మందడం, తుళ్లూరు, కృష్ణాయపాలెం సహా వివిధ ప్రాంతాల్లోని దీక్షా శిబిరాల్లో ఉదయం నుంచే రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు ఇస్తున్నామంటూ పేదలను ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న పట్టాల పంపిణీ సభకు వెళ్తున్న బస్సులు శిబిరాల వద్దకు చేరినప్పుడు... రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెల్లని పట్టాల్ని ఇస్తున్న ప్రభుత్వాన్ని నమ్మవద్దని పేదలకు సూచించారు.
ప్రభుత్వానికి పతనం తప్పదు.. రాజధాని వినాశనమే లక్ష్యంగా, మాస్టర్‌ప్లాన్‌ను దెబ్బతీసే చర్యలకు ప్రభుత్వం పూనుకొందని రైతులు ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలను సహించబోమని తేల్చిచెప్పారు. విధ్వంసకర ఆలోచనలతో ఉన్న ప్రభుత్వానికి పతనం తప్పదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలోని దీక్షా శిబిరాల నుంచి రైతులు, మహిళలు బయటికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. జేఏసీ ముఖ్యనాయకులను గృహనిర్బంధం చేశారు. ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు, నలుపు వస్త్రాలతో ఆందోళనలు చేపట్టాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది.
పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు... ఇవాళ రాజధాని ప్రాంత వెంకటపాలెంలో 50 వేల 793 మంది మహిళలకు ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో మందడం సాయిబాబా గుడిలో అమరావతి శ్రీరామ నామ స్తూపానికి శంకుస్థాపన చేస్తారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో 3 వేలమంది పోలీసులతో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారనే సమాచారంతో... వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే అమరావతి జేఏసీ ముఖ్య నేతల్ని బయటకు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ఇవీ చదవండి :