గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు చేశాయి. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా... ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి..ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం.. ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.
రమ్య హత్య కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. సమాజంలోని అన్ని వర్గాల్ని కదలించిన ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: Ramya Case Judgement: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తి.. మరో రెండ్రోజుల్లో తీర్పు