రాష్ట్రంలో సంచలనం కలిగించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో ఓ నిందితుడి ఆచూకీ ఇంకా తెలియలేదు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద కొన్ని నెలల కిందట ఓ యువతిపై కొందరు అత్యాచారం చేయగా.. ఈ ఏడాది జూన్ 19న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-2 రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన జరిగిన 48 రోజులకు ఆగస్టు 7న ఏ-1 షేర్ కృష్ణతో పాటు అతని వద్ద సెల్‌ఫోన్లు తాకట్టు పెట్టుకున్న మరో వ్యక్తిని ఏ-3గా చూపి అరెస్టు చేశారు. ఏ-2 ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ కోసం 120 రోజులుగా గాలిస్తున్నా.. ఫలించలేదు. అతడిని పౌరులు గుర్తించేలా రెండు పాత ఫొటోలు, ఇతర వివరాలు ఫేస్‌బుక్‌లో పోలీసులు ఆదివారం పోస్టు చేశారు.
ఏ-2 వివరాలివీ..
ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కుక్కలవారిపాలేనికి చెందిన రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్(22) కుడిచేతిపై పుణ్యవతి అనే పచ్చబొట్టు ఉంటుంది. తాపీపని, కప్ బోర్డులు అమర్చే పనులతో పాటు కర్ర నరకటం, వరికుప్పల నూర్పిడి, క్యాటరింగ్‌కు వెళ్లటం, రైళ్లలో యాచిస్తూ, సమోసాలు విక్రయించే వారితో తిరుగుతాడు. రైలుపట్టాల పక్కన, అండర్‌పాస్‌లు, పాడుపడిన భవనాలు, హైవే అండర్‌పాస్, అన్నదానాలు చేసే ఆలయాల వద్ద ఆశ్రయం తీసుకుంటున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తిస్తే మంగళగిరి ఉత్తర మండల డీఎస్పీ, లేదా తాడేపల్లి సీఐ, ఎస్సైలకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: cm jagan: గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం జగన్