కొవిడ్ లాక్‌డౌన్ సమయం ఎంతోమందిని ఇబ్బందిపెడితే.. కొందరికి మాత్రం కొత్త ఆలోచనలు కలిగించేలా చేసింది. గుంటూరు జిల్లా మాచర్లలోని నెహ్రూనగర్‌కు చెందిన అనుపమ.. లాక్‌డౌన్ సమయాన్ని కూరగాయల సాగు కోసం వెచ్చించారు. బీకామ్ కంప్యూటర్స్ చదువుతోన్న ఆమె అంతర్జాలం ద్వారా మిద్దె సాగు విధానం గురించి తెలుసుకున్నారు. ఇంటిపైన ఉన్న కొద్దిపాటి స్థలంలోనే సాగును ఆరంభించారు. అలా ప్రారంభించిన మిద్దె సాగు.. ఇంటి ఆవరణ ఆహ్లాదానికి చిరునామాగా మారింది.
ఇంటి మిద్దెపై... ద్రాక్ష, జామ, నిమ్మకాయలతోపాటు 28 రకాల కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం... కూరగాయల వ్యర్ధాలు, ఇతర వ్యర్ధాలను మాత్రమే మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఫలాలు, కూరగాయల్లో అధికంగా పురుగు మందులు వాడుతున్నారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సహజ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలను తింటే ఆరోగ్యకరంగా ఉండొచ్చునని అనుపమ తెలుసుకుని ఇలా ఆచరిస్తున్నారు. అదే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి మిద్దెపై కూరగాయలు, ఫలాలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అనుపమ గురించి తెలుసుకున్న అధికారులు ఆమెను సత్కరించారు.
ఇదీ చూడండి: