తనకు బీసీ - ఈ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేంత వరకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ అధ్యక్ష , ఉపాధ్యక్ష , మెంబర్ ఎన్నికను నిలువరించాలని కోరుతూ చిలువూరు -1 తెదేపా ఎంపీటీసీ షేక్ జబిన్ హైకోర్టును ఆశ్రయించారు. బీసీ మహిళకు రిజర్వు అయిన దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అడ్డుకునే చర్యలో భాగంగా అధికారపార్టీ నేతల ఆదేశాల మేరకు తహసీల్దార్ తన దరఖాస్తును తిరస్కరించారన్నారు. ఆమె తరపు న్యాయవాది ఎస్.ప్రణతి ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ను కోరారు. న్యాయమూర్తి గురువారం విచారిస్తామని తెలిపారు. బీసీ - ఈ కులధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి దుగ్గిరాల తహసీల్దార్ నిరాకరించారని వ్యాజ్యంలో తెలిపారు .
సబ్ కలెక్టర్ విచారణ..
దుగ్గిరాల ఎంపీటీసీ అభ్యర్థి జబీన్ కుల ధ్రువీకరణపై క్షేత్రస్థాయిలో తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా విచారణ చేపట్టారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జబీన్ తండ్రి షేక్ బద్రుద్దీన్‌ను ఆమె విచారించారు. తనకు బీసీ కుల దృవీకరణ పత్రం ఇవ్వకపోవడంపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్‌కు జబీన్ ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వివేక్ యాదవ్ తెనాలి సబ్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి సబ్ కలెక్టర్ జేబిన్ తండ్రిని విచారించారు. కాగా దుగ్గిరాల ఎంపీపీ పదవికి ఇప్పటికే రెండు సార్లు ఎన్నిక వాయిదా పడగా.. మూడో సారి ఈ నెల 8వ తేదీన ఎన్నిక జరుగనుంది.
ఇదీ చదవండి: New Agriculture Acts: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: జీవీఎల్