Battery Vehicles Making: ఇటీవలి కాలంలో బ్యాటరీ వాహనాల వినియోగం పెరుగుతోంది. పెట్రో ధరల మోత కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే వాటి ధర ఎక్కువగా ఉండటం కొంచెం ఇబ్బందిగా మారింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకటనారాయణ మాత్రం కొంచెం తెలివిగా ఆలోచించి సొంతంగానే బ్యాటరీ వాహనాలు తయారు చేసుకున్నారు. అలాగని ఈయన ఇంజినీరేం కాదు... కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివారు. మోటార్లు, బ్యాటరీలకు సంబందించి పనులు నేర్చుకున్నాడు.
తెనాలిలోని కుమార్ పంప్స్‌లో ఉద్యోగం చేస్తూనే ఎలక్ట్రిక్, బ్యాటరీకి సంబంధించి రకరకాల ప్రయోగాలు చేశారు. పదేళ్ల క్రితం ఒక పాత ఆటో కొని దాని ఇంజిన్ తీసివేసి సోలార్ శక్తితో నడిచేలా మార్చారు. అందులో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించాడు. తాను తిరగటానికి సొంతగా బ్యాటరీ బైక్ తయారు చేసుకున్నారు. వాహనాల విడి భాగాలు కొనుగోలు చేసి తనకు నచ్చిన రీతిలో ఒక బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి డిజైన్ మొత్తం వెంకట నారాయణదే కావటం విశేషం. ఇలాంటి వాహనాల వల్ల తనకు పెట్రోలు బిల్లు లేకుండా పోయిందని... చాలా ఖర్చులు కలిసొచ్చాయని చెబుతున్నారు. బ్యాటరీ వాహనాల వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరగదంటున్నారు.
ఇదే క్రమంలో కారు కొనాలని భావించిన నారాయణ ధరలు చూసి వెనక్కు తగ్గాడు. అయితే తనకున్న నైపుణ్యంతో ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. చిన్న ఎలక్ట్రిక్ కారును రూ.40 వేలకు కొనుగోలు చేశారు. దానిపై సోలార్ ప్యానెల్స్ బిగించి వాటి ద్వారా ఉత్పన్నమయ్యే సౌర శక్తితో వాహనం నడిచేలా ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ ద్వారా కారులోని బ్యాటరీలు ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతాయి. ఫుల్‌గా ఛార్జింగ్ అయితే 150 కిలోమీటర్లు కారు నడుస్తుందని వెంకటనారాయణ తెలిపారు.
తక్కువ సోలార్ శక్తితో భారీ జనరేటర్లు తిప్పి ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్నది తన లక్ష్యమని నారాయణ తెలిపారు. దీనికి సంబందించి ప్రయోగాలు చేస్తున్నారు. బ్యాటరీ వాహనాలే కాకుండా ఇంటిలో నీటి మోటారుతో సహా పలు వస్తువులు సౌరశక్తితో నడిచేలా ఏర్పాటు చేసుకున్నారు. అలా నెలకు రూ.1000 వరకు విద్యుత్తు బిల్లు ఆదా చేస్తున్నారు. తన ఆలోచనలకు పదును పెట్టుకుంటూ, ఆధునికత అంది పుచ్చుకుంటూ ఈయన చేస్తున్న ప్రయత్నాలు అందరికీ స్పూర్తిని పంచుతున్నాయి.
ఇవీ చదవండి: