గుంటూరు జిల్లా తెనాలిలోని స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో కొవిడ్ బాధితుల కోసం జర్మన్ హ్యాంగర్స్ విధానంలో చేపట్టిన తాత్కాలిక వైద్యశాల పనులు తుది దశకు చేరాయి. ఇందులో 50 మంది బాధితులకు చికిత్స అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవిడ్‌తో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది ఆరోగ్యం కుదుటపడి, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగాల్సిన వారిని ఇక్కడికి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా సద్వినియోగం చేసుకోవడం, పాజిటివ్‌లకు కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టనున్నారు. రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ, పురపాలక, విద్యుత్తు, వైద్యారోగ్య విభాగాలు ఇక్కడి పనులను సమన్వయం చేస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో దీనిని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ వైద్యశాల కోసం 50 పడకలను అమెరికాలోని ప్రవాస భారతీయ సంస్థ ‘ఎంపవర్ అండ్ ఎక్సెల్’ సమకూర్చింది. సంస్థ వ్యవస్థాపకురాలు ఆయేషా చారగుల్ల తమ ప్రతినిధి కల్యాణ్‌కృష్ణకుమార్ ద్వారా వాటిని అందించినట్టు తహసీల్దార్ రవిబాబు తెలిపారు. పడకలను అందించిన కార్యక్రమంలో పోతావఝుల పురుషోత్తమశర్మ, శివకుమార్, దత్తాత్రేయశాస్త్రి, శ్రీనివాస్, శివరామకృష్ణప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఆనందయ్య వైద్యంపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి'