Telangana Minister Koppula Eshwar: సీఎం కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గే సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రధాని నరేంద్రమోదీ రామగుండంలో ప్రకటించారని.. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దిక్కు దివాణం లేకనే అక్కడ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరి మారడం లేదని.. అక్కడ మోదీ స్పందించలేదని మంత్రి అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఏపీలో పెట్టారు తప్ప తెలంగాణలో జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నందునే సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదన్నట్లుగా మోదీ మాట్లాడారన్నారు. మోదీ ప్రధాని స్థాయిలో ఉండి ప్రజలను తప్పుదొవ పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రామగుండంలో ప్రధాని ప్రకటనకు.. పార్లమెంటులో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానికి తేడా ఉందన్నారు.
బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడమంటే.. సింగరేణిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం కాదా అని మంత్రి ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను మినహాయింపు, పెన్షనర్ల సమస్యలపై కూడా ప్రధాని మాట్లాడితే బాగుండేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాశామని.. భవిష్యత్తులో ఈ ఆంశంపై నిరసనలు తప్పవన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై ప్రధాని మోదీకి చెప్పి చెప్పి సీఎం కేసీఆర్ అలసిపోయారు.. ఇక పీఎంను కలిసినా లాభం లేదని రామగుండం వెళ్లలేదన్నారు. రామగుండం కార్యక్రమానికి స్థానిక ఎంపీగా తనను పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆరోపించారు. స్థానిక ఎంపీ కాకపోయినప్పటికీ బండి సంజయ్ ను కార్యక్రమానికి ఎందుకు పిలిచారన్నారు. భాజపా కార్యక్రమంలా నిర్వహించారని.. దీనిపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: