TDP Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు (Chandrababu Arrest) నిరసనగా ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మేము సైతం బాబు కోసమంటూ తెలుగుదేశం శ్రేణులు కదం తొక్కుతున్నారు. బాబును విడుదల చేయాలంటూ వినూత్న నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి.. విజనరీ నాయకుడిని అరెస్టు చేసి.. జైల్లో పెట్టారంటూ మండిపడుతున్నారు. బాబు బయటికి వచ్చే వరకు దీక్షలు, నిరసనలకు విరామం ప్రకటించేది లేదని స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యువత.. ఉరితాళ్లతో వినూత్న నిరసన తెలిపారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొత్తూరు నుంచి కొమ్మినేనివారి పాలెం వరకు 10 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహిళలు.. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్టీఆర్ (NTR) జిల్లా మైలవరంలో రిలే దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు.
కర్నూలు జిల్లా గోనెగండ్లలోని దీక్షా శిబిరం వద్ద ఓ కార్యకర్త మేము సైతం బాబు కోసమంటూ రక్తంతో రాశారు. కర్నూలులో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి వినతిపత్రం అందించి మేము సైతం బాబు కోసమంటూ నినాదాలతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి క్లాక్ టవర్ వరకు శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో గాంధీ విగ్రహం వద్ద శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డుపై బైఠాయించి వినూత్న నిరసన తెలిపారు.
చంద్రబాబుకు మద్దతుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుతూ కాకినాడ జిల్లా పెదపూడి మండలం కైకవోలులో చర్చిలో శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రేణులు ఉరితాళ్లతో నిరసన తెలిపాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందని అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో పడవలుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. సీఎం జగన్ ఉద్దేశ్యపూర్వకంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడీపీ అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పాలకొల్లులో శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రక్తంతో సంతకాల సేకరణ చేశారు. తెలుగు యువత సభ్యులు రక్తాన్నైనా చిందిస్తాం కాని చంద్రబాబును కాపాడుకుంటాం అంటూ సంతకాలు చేసి, రక్తంతో వేలిముద్రలు వేసి పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేశారు.