తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. వైకాపా దౌర్జన్యం నశించాలని నినదించారు. కాగా.. నిరసనల్లో పాల్గొన్న తెదేపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.
- పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
- బాపట్లలో తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ కూడలిలో నిరసన చేపట్టిన తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు-నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
- నరసరావుపేటలో తెలుగుదేశం శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్న నేతలను ఓవర్ బ్రిడ్జిపై అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు.
- తెనాలిలో తెలుగుదేశం శ్రేణులు బస్సులను అడ్డుకున్నాయి. బస్టాండ్ సెంటర్ నుంచి పురపాలక కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి.
- రేపల్లె బస్టాండ్ సెంటర్ లో ప్రధాన రహదారి పై తెలుగుదేశం నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. సాక్షి దినపత్రికను కాల్చి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- వినుకొండలో తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. పోలీసులు అడ్డుకుని వారిని వినుకొండ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి బొల్లాపల్లి స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా.. తెలుగుదేశం నేతలు ప్రతిఘటించారు.
- చిలకలూరిపేటలో పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన తెలిపారు.
- గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రోడ్లపైకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. తుళ్లూరులో తెదేపా నేతలు దుకాణాలు మూయించారు. మందడంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో భైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తాడేపల్లిలో ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- కేంద్ర పార్టీ కార్యాలయం, పట్టాభిరాం నివాసంపై దాడికి నిరసనగా రాష్ట్ర బంద్‌లో భాగంగా.. గుంటూరులోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు పోలీసులకు తెదేపా నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆనంద్ బాబును గృహనిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను వైకాపా ప్రభుత్వం హరించివేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
- నరసరావుపేట నియోజకవర్గంలో తెదేపా నాయకులు మంగళవారం ఆందోళనలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
- పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాల్లో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.
- కాకుమానులో తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలకు సెలవు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. పాఠశాలలకు సెలవు ఇచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో నాయకులు బాపట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.
ఇదీ చదవండి: TDP PROTEST: వైకాపా దాడులకు వ్యతిరేకంగా.. పెల్లుబికిన తెదేపా నిరసన