Tdp Opposes Tammineni Sitaram : రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాయగా.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తమ్మినేని వ్యాఖ్యలను ఖండించారు. సభాపతి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి.
డీజీపీకి లేఖ రాసిన వర్ల : రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. స్పీకర్ తమ్మినేని హెచ్చరికల వెనక టీడీపీ అధినేత చంద్రబాబుపై పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై జరుగుతున్న రాజకీయ కుట్రల్లో భాగంగా దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని లేఖలో కోరారు. అనేక భద్రత లోపాలు చోటు చేసుకుంటున్నాయని భద్రతపై నిఘా ఏర్పాటు చేయాలని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు.
సీతారాం వ్యాఖ్యలను ఖడించిన కాల్వ శ్రీనివాసులు : శాసనసభ స్పీకర్ తమ్మినేని చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కోరారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రవేశపెట్టిన సంచలన మేనిఫెస్టోను చూసి వైసీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబుపై కుట్రలు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
తమ్మినేని చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక స్పీకర్ హాదాలో ఉండి బజారు మనిషిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ.. ప్రజలకు భరోసా ఇస్తుందన్నారు. మహిళలకు, రైతులకు సామాన్య ప్రజలకు సైతం అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేసే దిశగా టీడీపీ బాధ్యత తీసుకుంటుందని అన్నారు.
"మేనిఫెస్టో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వాళ్లకు రాత్రిళ్లు కూడా నిద్ర పట్టడం లేదు. రాజ్యంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్.. చంద్రబాబుకు బ్లాక్ క్యాట్ కమాండోలు ఎందుకు.. పక్కకు పోతే ఫినిష్ అవుతారని మాట్లాడుతున్నారు. అసలు ఎంటీ మీ ఉద్దేశ్యం" - కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి
శ్రీకాకుళంలో టీడీపీ శ్రేణుల నిరసన : తమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై తెలుగుదేశం నేతల స్పందన మాత్రమే కాకుండా మరోవైపు చంద్రబాబుపై సభాపతి తమ్మినేని చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఖండించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట ఆమె అధ్వర్యంలో టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తమ్మినేని చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
"చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన హయాంలో అన్ని పదవులు అనుభవించారు. ఆయనతో పాటు మంత్రివర్గంలో ఉండి.. ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా బాధకరంగా ఉంది. ఈ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలి." - గుండ లక్ష్మీదేవి, మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి :