TDP MLA, MLCs Boycott Assembly: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఉభయ సభలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వైసీపీ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా.. తమ అధినేతకు జరుగుతున్న ఆన్యాయాన్ని వారు నిరసన ద్వారా వ్యక్త పరిచారు.
ఈ సందర్బంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎటువంటి తప్పు చేయని తమ నాయకుడ్ని అరెస్టు చేసి వైసీపీ రాక్షస ఆనందం పొందుతోందని మండిపడ్డారు. శాసన సభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియజేసేందుకే తాము సెల్ఫోన్లను వినియోగించాలనుకున్నామని తెలిపారు. శాసన సభలో ఏం జరుగుతుందో తెలియకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇలా సెల్ఫోన్లలో రికార్డు చేసినందుకు.. తామేదో అన్యాయం చేసినట్లు.. ఎవరి మీదనో దాడి చేసినట్లు స్పీకర్ తమని సభ నుంచి పంపించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని.. రాష్ట్రానికి, దేశానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి మీద అవినీతి ఆరోపణ చేసి జైలులో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. శాసనసభలో జరిగిన తీరుకు నిరసనగా.. సభను బాయ్‌కాట్ చేసినట్లు అచ్చెన్న ప్రకటించారు. ఈ సెషన్ సమావేశాల్లో పాల్గొనటం లేదని.. శాసనసభ పక్షం, కౌన్సిల్‌కు హాజరు కావటం లేదని వెల్లడించారు.
TDP MLAs MLCs Condemned Chandrababu Arrest: ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు.. ప్రజలంతా మా వెంటే : టీడీపీ
శాసన సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వాస్తవాలు పేరుతో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజంటేషన్ స్కిల్ డెవలప్మెంట్లోని.. వివరాలు అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ఆ ప్రాజెక్టులోని నిజాలను మీడియాకు వివరించారు.
అంతకు ముందు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్షం, వైసీపీ బహిస్కృత ఎమ్మెల్యేలు ఈ నిరసనలో పాల్గొన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తివేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచీ నినాదాలతో కాలినడకన నేతలు అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల రెండోరోజు చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశంపై చర్చకు పట్టుబడతామని తెలుగుదేశం స్పష్టం చేసింది.
అధికారపక్షం ఎంత దుందుడుకుగా వ్యవహరించినా వెనక్కి తగ్గకూడదని, శాసనమండలిలోనూ ఇలాగే వ్యవహరిస్తామని ఎమ్మెల్యేలు వెల్లడించారు. స్కిల్ డెవల్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు ప్రభుత్వానికి స్పీకర్ అనుమతిస్తే తమకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయాలనీ నిర్ణయించారు. చంద్రబాబును తక్షణం విడుదల చేసి.. సీఎం జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలనే అజెండాతోనే తెలుగుదేశం నేతలు రెండో రోజూ శాసనసభ, మండలికి వెళ్లారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని సభలో లెవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది.
మాకు 16 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. విజయం మాదే: టీడీపీ నేతలు