TDP Leaders Protests on CBN Arrest Across AP: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. యువత భవితకు భరోసానిచ్చిన నైపుణ్యాభివృద్ధి సంస్థలో అక్రమాలు జరిగాయంటూ అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలను కొనసాగించాయి.
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నియోజకవర్గమంతా విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
నిడదవోలు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో 26వ రోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లాలోని బిక్కవోలు మండలం కొమరిపాలెంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దీక్షా శిబిరంలో పాల్గొని టీడీపీ నాయకులకు సంఘీభావం తెలిపారు.
దీక్షా శిబిరంలో నేలపై బైఠాయించి 'బాబుతో నేను' ప్లకార్డులు పట్టుకొని 'వియ్ వాంట్ జస్టిస్', 'బాబుతో నేను' అంటూ నినాదాలు చేశారు. తమ అధినేత చంద్రబాబు నాయుడుని విడుదల చేసేంత వరకు ఉద్యమం ఆపేదే లేదంటూ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో తెలుగు యువత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కంకిపాడు మండలం కొనతనపాడు వద్ద జాతీయ రహదారి దిగ్భందనం చేసి టైర్లు కాల్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో తెలుగుదేశం నాయకులు దీక్షా శిబిరాన్ని ఏర్పాటుచేసి చేపట్టిన నిరసన 28వ రోజుకు చేరుకుంది. ఈరోజు తెలుగుదేశం నాయకులు అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో జనసేన, తెలుగుదేశం పార్టీల.. నాయకులు, కార్యకర్తలు, నిరసన దీక్షలు చేపట్టారు. ఏపీలో అభివృద్ధి కావాలంటే.. జగన్ పోవాలంటూ.. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు 24 రోజువ రోజు నిరసన కొనసాగించారు. నియోజకవర్గ మహిళా విభాగం నేతలు దీక్షలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పిచ్చి తుగ్లక్‌ను మరిపిస్తున్నాడని మహిళా విభాగం నేతలు ఆరోపించారు. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు చూపించని ప్రభుత్వం.. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు.. లేనిపోని తప్పుడు కేసులను చంద్రబాబుపై పెడుతోందని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన తెలిపారు. రిలే దీక్షా శిబిరంలో మెడలకు ఉరితాడులు బిగించుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.