TDP Leaders Protests by Across the State Against CBN Illegal Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. తమ అధినేతను తక్షణమే విడుదల చేయాలంటూ.. వినూత్న రీతిలో ఆందోళనలు నిర్వహించారు. రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. 'సైకో పోవాలి-సైకిల్ రావాలి' అంటూ నినదించారు. జైలు నుంచి చంద్రబాబు విడుదల అయ్యేవరకు విశ్రమించబోమని తేల్చి చెప్పారు.
TDP Protest in NTR District Jaggaiyapet: చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షకు.. సీపీఐ, A.I.Y.F. నాయకులు సంఘీభావం తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు అరగుండుతో నిరసన తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటూ.. గన్నవరంలో ఆ పార్టీ శ్రేణులు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. అవనిగడ్డలో జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేశారు. తప్పుడు కేసులతో చంద్రబాబుని జైలుకి పంపించి జగన్ కుట్రలు పన్నుతున్నారని.. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ శ్రేణుల దీక్షకు రైతు సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు.
TDP Protest in Guntur District Ponnur: చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా పొన్నూరులో N.G రంగా విగ్రహం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో గౌడ సామజిక నేతలు నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ అన్ని రకాలుగా నాశనం చేశారని.. తెనాలిలో టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. తెనాలిలోని రామలింగేశ్వరరావు పేట చైతన్య కాలేజీ నుంచి స్వరాజ్ థియేటర్ వరకు టీడీపీతో కలిసి వివిధ విద్యార్థి సంఘాలు ర్యాలీ చేశాయి. బాపట్ల జిల్లా అద్దంకిలో టీడీపీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని పశుగ్రాసం తింటూ నిరసన తెలిపారు. మంగళగిరిలో I.T.D.P. నేతలు నల్లకండువాలతో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చీమకుర్తిలో మంగమూరుకి చెందిన అభిమానులు కుటుంబీకులతో సహా దీక్షలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు.
Balakrishna Comments on Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా.. ఐ డోంట్ కేర్ బ్రో: బాలకృష్ణ
TDP Protest in Rayalaseema: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాయలసీమలో ఆందోళనలు మిన్నంటాయి. సత్యసాయి జిల్లా కనగానపల్లిలో కురబలు చేస్తున్న శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కురబ వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. కదిరిలో తెలుగు యువత నాయకులు బైకులు, ఆటోలతో ర్యాలీ చేశారు. ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోలుస్తూ.. రొల్ల మండల కేంద్రం బస్టాండ్ కూడలిలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో దున్నపోతుతో నిరసన తెలిపారు.
అనంతరం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ హిందూపురంలో పోలీసులకు పుష్పగుచ్ఛాలను ఇచ్చి చేతులు జోడించి నమస్కరించారు. అనంతపురంలోని రాంనగర్ కమ్మ భవన్ సమీపంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రిలే నిరాహార దీక్ష చేశారు. తిరుపతి నగరపాలక కార్యాలయం ముందు చంద్రబాబుకు మద్దతుగా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు నిరసన తెలిపారు. కడప ఎన్టీఆర్ కూడలి వద్ద బెస్త సాధికారిక కమిటీ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన చేశారు. కడపలో టీడీపీ దీక్షలకు దివ్యాంగులు మద్దతు ప్రకటించారు. కర్నూలులో చెవిలో పువ్వులు పెట్టుకుని.. శ్రేణులు దీక్షల్లో పాల్గొన్నారు. మంత్రాలయంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఆదోనిలో అక్షరాలతో అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు.
TDP protest in Konaseema District: చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. విజయనగరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో స్థానిక ఎమ్మెల్యే.. అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటబొమ్మాళిలో శ్రీశైన సామాజిక వర్గం మహిళలు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. పార్వతీపురం జిల్లా బాగవలస గ్రామంలో మోకాళ్ళతో కూర్చొని మహిళలు నిరసన తెలిపారు. ఈ తుగ్లక్ మాకొద్దు అంటూ కోనసీమ జిల్లా రావులపాలెంలో తుగ్లక్ వేషధారణతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చేతులకు సంకెళ్లు వేసుకుని దీక్ష చేశారు. జంగారెడ్డిగూడెంలో తెలుగు యువత స్థానిక గంగానమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి నల్ల బెలూన్లతో ర్యాలీ నిర్వహించారు.
''చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ..ఈరోజు జలదీక్ష చేశాం. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని గోదావరి మాతకు పూజలు చేశాం. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. త్వరగా విడుదల కావాలని.. అట్లాంటాలో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినదించారు.''- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం సీనియర్ నేత