TDP Leaders on YSRCP: తన పరిపాలన రథం తిరోగమనంలో పయనిస్తోందన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి తన పార్టీ నేతలను రెచ్చగొట్టి వారితో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అనరాని మాటలు అనిపించి ఆయన్ను కించపరిచారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అర్థమయ్యే.. ముఖ్యమంత్రి, మంత్రులు నోళ్లకు పని చెబుతున్నారని ధ్వజమెత్తారు. దళితులకు జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందని వర్ల రామయ్య ప్రశ్నించారు.
రజనీకాంత్‌పై వైసీపీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయం: తెలుగుదేశం, జనసేన పొత్తులు ఇంకా ఖరారు కాలేదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ తెలిపారు. పొత్తులు ఖరారు కాకముందే వైసీపీ నేతలకు ఎందుకంత ఉలుకని ప్రశ్నించారు. చంద్రబాబు-పవన్ భేటీ జరిగితేనే వైసీపీ భయపడిపోతోందని ఎద్దేవా చేశారు. తలైవా రజనీకాంత్‌పై వైసీపీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయమని మండిపడ్డారు. రజనీకాంత్‌కు టీ కప్పులు అందించిన చరిత్రను కొడాలి నాని మరిచినట్టున్నారని విమర్శించారు.
అందులో తప్పేముంది: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ నేతలు విమర్శలకు దిగటంపై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్, చంద్రబాబుని రజనీకాంత్ ప్రశంసించటంలో తప్పేం ఉందన్నారు. కానీ వైసీపీ చిల్లర బ్యాచ్ ఆయనపై విమర్శలు చేయటం వల్ల ఏపీ పరువు పోయిందని అభిప్రాయపడ్డారు.
విమర్శలపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదు: ప్రభుత్వ బాధ్యత లేనితనం.. అన్నదాతలకు శాపంగా మారిందని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రజనీకాంత్‌పై విమర్శలు చేయడం, చొక్కాలు విప్పి తిరగడంపై ఉన్న శ్రద్ధలో సగమైనా రైతుల కష్టాలపై పెట్టారా అని నిలదీశారు. పంటలు తడిచిపోయి మిరప, ధాన్యం రైతులు విలపిస్తుంటే.. మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి మెప్పు కోసం ఎన్టీఆర్ కీర్తిప్రతిష్ఠల్ని మసక బార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.
అకాల వర్షాలతో నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు 50వేలు, అరటి, పసుపు, బొప్పాయి, మామిడి రైతులకు ఎకరాకు 50వేలు, జొన్న, మొక్కజొన్న, ఇతర అపరాల పంటలు నష్టపోయిన రైతులకు 20వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని డిమాండ్ చేశారు. పిడుగుపాటుకు గురై మరణించిన ప్రతి రైతు కుటుంబానికి, 25లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి: