TDP Leaders Fires on YCP Govt: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 34 పంచాయతీ, 234 వార్డు ఉపఎన్నికల్లో పోలీసులు, వాలంటీర్లు, డబ్బు, మద్యాన్నే అధికారపార్టీ నమ్ముకుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. ప్రజా బలం లేదని తెలిసే అధికార దుర్వినియోగంతో వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. వైసీపీ దుశ్చర్యలు, పోలీసులు, వాలంటీర్ల.. ఓవరాక్షన్‌పై ఎన్నికల కమిషన్(Election Commission) స్పందించదా..?అని ప్రశ్నించారు.
సాధారణ ఉపఎన్నికల ఫలితాలతో ఒరిగేదేమీ లేదని తెలిసీ.. ఇంతటి బరితెగింపా అంటూ నక్కా ఆనంద్‌బాబు దుయ్యబట్టారు. టీడీపీ నేత, కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిని గృహ నిర్భందం చేసిన పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని పోలింగ్ బూత్‌లో ఎలా కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలివేటుగా మారిందని ఆయన మండిపడ్డారు. పంచాయతీ, వార్డు సభ్యున్ని కూడా గెలిపించుకోలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడంటూ దుయ్యబట్టారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలను వదిలిపెట్టి టీడీపీ నేతలను ఏవిధంగా అరెస్టు చేస్తారని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేకు స్థానికంగా తిరిగే హక్కు లేదా..?, దళిత ఎమ్మెల్యేకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన మండిపడ్డారు. దీంతోపాటు వాలంటీర్లు(Volunteers) నేరుగా ఓటర్లను ప్రలోభపెడుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని నిలదీశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా వ్యవస్థల్ని చెరబట్టి గెలవాలనుకుంటే వైసీపీకు భంగపాటేనని నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో కొండపిలో ప్రజాస్వామ్యయుతంగా పోలింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నక్కా ఆనంద్‌బాబు కోరారు.
మరోవైపు.. ఓటమి భయంతో సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండచూసుకునే వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. అధికార పార్టీ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు.
అధికార పార్టీకి ఒక రూలు-ప్రతిపక్షానికి ఒక రూలా అంటూ మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పారిపోవడం ఖాయమని అన్నారు. వీరమ్మకుంటలో చోటుచేసుకున్న ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించాలన్న ధూళిపాళ్ల నరేంద్ర.. దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హిందూపూర్ నియోజకవర్గం చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేస్తున్న శ్వేత, నరేశ్ అనే వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, కలెక్టర్లకు ఆయన ఫిర్యాదు చేశారు.