TDP leaders fire on YCP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అద్దె ఇంటిని అటాచ్‌మెంట్ చేయడం వైసీపీ సర్కార్ సైకో చర్యలకు నిదర్శనమని.. తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డుకు మార్పు చేసి అక్రమాలకు పాల్పడ్డారంటూ సైకో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోర వైఫల్యం, వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న నాటకమని ఆక్షేపించారు.
ఉండవల్లి నివాసం ప్రభుత్వ భూమిలో ఉందని ఒకసారి, అక్రమ కట్టడమని మరోసారి.. ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటోందని దుయ్యబట్టారు. వాస్తవాలను తొక్కిపెట్టి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అటాచ్‌మెంట్ ఆర్డర్ ఇవ్వటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. లింగమనేని రమేష్ రాష్ట్ర విభజనకు ముందే గుంటూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారని తెలిపారు. చేయని తప్పులపైనే అక్రమ కేసులు పెట్టి నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతలను వేధిస్తున్న జగన్.. ఈ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న మచ్చ లేని చంద్రబాబుకు మరక అంటించాలని చూస్తే.. అది తిరిగి వైసీపీ ప్రభుత్వానికే అంటుకుంటుందని మరో నేత దేవినేని ఉమ హెచ్చరించారు. లోకేశ్ పాదయాత్ర వందరోజుల సందర్భంగా తెలుగుదేశం చేపట్టనున్న కార్యక్రమాల నుంచి డైవర్ట్ చేసేందుకే.. అటాచ్‌మెంట్‌ను తెరపైకి తెచ్చారని సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబుపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా నిరూపించలేదని.. ప్రస్తుత ఆరోపణల విషయంలోనూ అదే జరుగుతుందని పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. వైకాపా వికృత పోకలను ప్రజలు గమనిస్తున్నారన్న తెలుగుదేశం నేతలు.. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నివసిస్తున్న ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి రాష్ట్రప్రభుత్వం అనుమతిచ్చింది. లింగమనేని రమేష్‌కు చెందిన డోర్ నంబర్ 17-3-378/1 గల ఆ ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. రాజధాని నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్మెంట్, కంతేరు, నంబూరు, కాజ గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూములు విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని.. తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. అందుకు ప్రతిగా.. లంచం/క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారని సీఐడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు పై వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి: