బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించడం సీఎం జగన్‌కు ఇష్టం లేదని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీసీలకు 15 వేల పోస్టులు రాకుండా జగన్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. తెదేపాకు వెన్నెముక బీసీలని తెలిసే వారిపై కక్షగట్టారని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం తగ్గించేందుకే తంటాలు పడుతున్నారని యనమల అన్నారు.
తన అనుచరుడితో సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేయించారని యనమల రామకృష్ణుడు అన్నారు. రెడ్డి సంఘం అధ్యక్షుడితో కేసు వేయించడమే బీసీలపై జగన్ వ్యతిరేకతకు రుజువని యనమల ఆరోపించారు. సీఎం కాగానే జగన్ బీసీ నిధుల్లో భారీగా కోతలు పెట్టారని... ఆదరణ వంటి అనేక బీసీ పథకాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పేదల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ బీసీ వ్యతిరేక చర్యలను అందరూ గర్హించాలని... బీసీలపై కక్షసాధింపు చర్యలను ఖండించాలని యనమల రామకృష్ణుడు అన్నారు.
ఇదీ చదవండి : అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ