Lokesh On Jagan Govt: ప్రజాసంక్షేమ పాలన చేయాల్సిన ప్రభుత్వం.. వారిపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనాతో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఇంటింటికీ వెళ్లి లోకేశ్ పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమకు ఇళ్లు కేటాయిస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అనర్హులుగా ప్రకటించిందని ఈ సందర్భంగా మహిళలు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో డబ్బులు చెల్లించాలని అధికారులు బలవంతం చేస్తున్నారని వాపోయారు. చంద్రన్న బీమా పథకాన్ని ఎత్తివేయటం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు.
లోకేశ్‌ని కలిసిన 85 ఏళ్ల వీరయ్య అనే వృద్ధుడు కంటి సమస్య ఉందని చెప్పటంతో వారంలో శస్త్రచికిత్స చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి