అధికారులు ఈసీకి సహకరిస్తే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రి పెద్దిరెడ్డి బెదిరించడం దారుణమని నరసరావుపేట తెదేపా పార్లమెంటర్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలంటే.. మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని మీడియా సమావేశంలో ఈసీని కోరారు. ఇది వైకాపా ప్రభుత్వ అమానుష పాలనకు నిదర్శనమన్నారు. ఏకగ్రీవాలపై మంత్రి పెద్దిరెడ్డి కనీస పరిజ్ఞానం నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అధికారులను మంత్రి నేరుగా తిట్టినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తెదేపా పాలనలోనే అభివృద్ధి..
పంచాయతీ ఎన్నికల నామినేషన్లలోనే వైకాపా భయపడుతున్నట్లు తెలుస్తోందని ఆంజనేయులు వ్యాఖ్యానించారు. తెదేపా పాలనలో ప్రతి పల్లెను అభివృద్ధి బాటలో నడిపిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్రస్తుతం రాజకీయ కక్షలు, బెదిరింపులతో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడి.. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారెంత బెదిరిస్తే తెదేపా నేతలు అంత ముందుకు వెళ్తారని తెలిపారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తెదేపా ప్రభుత్వంలోనే వచ్చిందన్నారు. సీఎం జగన్ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఎద్దేవా చేశారు. జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెదేపా 80 శాతం సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదేమి స్వరాజ్యమో...?
గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా అని నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద బాబు ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధిలో అది కనిపించాలని పేర్కొన్నారు. కుల, రాజకీయ కక్షలను రెచ్చగొట్టే విధంగా వైకాపా పాలించడం ఏం స్వరాజ్యమో అర్థం కావడం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: