TDP LEADER GANTA LETTER TO CM JAGAN : సీఎం జగన్‌కు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి గంటా కొన్ని ప్రశ్నలు సంధించారు. పెట్టుబడుల స్వర్గధామం అయిన దావోస్‌లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకానిమిక్ ఫోరంకు వెళ్లకపోవడానికి గల కారణాలను తెలుపగలరా అని ప్రశ్నించారు. దాని వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ ఎంత దెబ్బతిందో కనీసం ఇప్పటికైనా గుర్తించారా అని నిలదీశారు. ఒక రాజధానినే నిర్మించుకోలేని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలం అని మండిపడ్డారు.
జాకీ కంపెనీ రాష్ట్రంలో ఉండలేమని పారిపోతుంటే, కారణాలని విశ్లేషించి ఆ తప్పులను సరిదిద్దుకుని పునరావృత్తం కావు అన్న భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు. కియా కంపెనీకి అనుబంధ కంపెనీలను ఒక్కటీ తీసుకురాలేకపోయినందుకు ఆత్మ సమీక్ష చేసుకున్నారా అని నిలదీశారు. హెచ్బీసీని ఇక్కడి నుంచి వెళ్లకుండా కనీసం ప్రయత్నం చేశారా అని ప్రశ్నించిన గంటా.. లులూ, అమరరాజాను ఇక్కడి నుంచి తరిమేశామని సదస్సులో చెబుతారా అని ఎద్దేవా చేశారు.
భోగాపురం విమానాశ్రయానికి నాలుగేళ్ల నుంచి శంకుస్థాపన చేయకుండా వదిలేసి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో అప్పటికే నిర్మించిన పోర్టులను తప్ప.. కొత్తగా ఒక్క పోర్టును అయినా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలకు ఎటువంటి నమ్మకం కలిగించకుండా.. సదస్సు పెట్టెంత సాహసం చేయడం వెనుక ఉన్న మీ కాన్ఫిడెన్స్‌ను ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులను ఆహ్వానించగలమా అని నిలదీశారు.
మీ ప్రభుత్వం వచ్చాకా ఇండస్ట్రీయల్ ఇన్సెంటివ్స్ ఒక్క కంపెనీకి.. ఒక్క రూపాయి అన్న ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రాంక్లిన్ లాంటి కంపెనీలు ఎందుకు ఇక్కడి నుంచి పారిపోయాయని ప్రశ్నించారు. అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన జరిగింది కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదని అయినా మళ్లీ అదనంగా భూమి కేటాయించడం వెనుక రహస్యం ఏంటని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతీ నెలా మొదటి తేదీ నుంచి చివరి తేదీ వరకూ ఎందుకు టైం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పగలరా అని నిలదీశారు.
సరైన ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తారా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తుండగా.. ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో ఈ హడావుడి వెనుకు కారణాలేంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి ఎంత మాత్రం కాదని.. మన రాష్ట్రంలో సగటు పౌరుని సందేహాలు మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ ప్రశ్నలపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: