Chandrababu Naidu: ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి నుంచి ఆయన పర్యటన ప్రారంభంకానుంది. సాయంత్రం నాలుగున్నరకు అమరావతి చేరుకోనున్న చంద్రబాబు.. నకిలీ విత్తనాలతో పంటలు నష్టపోయిన రైతులు, ఇసుక రీచ్‌లలో పనిచేసే కార్మికులు, పెన్నా- కృష్ణా నదుల అనుసంధానం కోసం పల్నాడు జిల్లా అన్నదాతలు చంద్రబాబుని కలవనున్నారు.
తర్వాత అమరావతిలోని గోపాలపురం, మ్యూజియం రోడ్డు, క్రోసూరు రోడ్డు, పోలీస్‌స్టేషన్ కూడలి మీదుగా చంద్రబాబు రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం జైల్‌సింగ్ నగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కవ్వింపు చర్యలకు దిగాయి. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని ఫిర్యాదు చేసినా ఎందుకు తీసివేయడం లేదని పోలీసులను తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. పోలీసులు జోక్యం చేసుకోకుంటే.. తామే ఆ ఫ్లెక్సీలు తీసివేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనకు ఆటంకం కలిగించాలని చూస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశంలోని రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పెదకూరపాడు టిక్కెట్ ఆశిస్తున్న వట్టిగుంట శేషగిరిరావు పేరిట ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై కొమ్మాలపాటి శ్రీధర్ ఫొటో లేకపోవడంపై ఆయన వర్గీయులు బ్యానర్లు చించివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
"యర్రగొండపాలెం ఘర్షణను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన పోలీసులు.. ఇంకా చర్యలకు ఎక్కడా ముందుకు వచ్చినట్టు కనిపించడం లేదు. కనుక జిల్లా ఎస్పీని కానీ, రాష్ట్ర డీజీపీని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం.. శాంతిభద్రతలు కాపాడుతారా లేదంటే అధికార పార్టీ తొత్తులగానే ఉండిపోతారా. శాంతిభద్రతలు కాపాడలేక పోతే మీరు పక్కకు తప్పుకోండి. ప్రతిపక్ష నేత పర్యటనలకు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం మంచిది కాదు. ఇది మీ పతనానికి నాంది. మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు". - ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి
"ఈ ఎమ్మెల్యే ఎందుకు సిగ్గుపడాలి అంటే.. ఇక్కడ జరుగుతున్న ఇసుక మాఫియాలు కావచ్చు, కృష్ణా నదిలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. మనం దానికి సిగ్గు పడాలి. అదే విధంగా ఈ నియోజగవర్గానికి ఏం చేయలేకపోయానని సిగ్గు పడాలి. అమరావతిని అభివృద్ధి చేయలేకపోయానని సిగ్గుపడాలి. మూడు రాజధానులలో.. ఏది రాజధానో చెప్పలేకుపోతున్నందుకు ఆయన సిగ్గుపడాలి". - కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: