TDP activists stage protests in AP: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అభిమాన నాయకుడికి మద్దతుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమలలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద టీడీపీ కార్యకర్తలు అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉరవకొండలో టీడీపీ వడ్డెర్ల సాధికార సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. సత్యసాయి జిల్లా కదిరిలో... 22వ రోజు దీక్షల్లో వాల్మీకి, స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొని.. బాబుకు మద్దతు తెలిపారు.
కర్నూలు జిల్లా: ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును జైలులో పెట్టడం బాధిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విచారం వ్యక్తం చేశారు. కర్నూలులో నిరసన దీక్షలకు మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి సంఘీభావం తెలిపారు. ఆదోనిలో... మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో... దీక్షలు కొనసాగాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ అభిమానులు అరగుండుతో నిరసన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లా: టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేపట్టారు. కృష్ణ కూడలి వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి శిబిరం వద్దకు చేరుకుని దీక్షలు ప్రారంభించారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో పుట్టా సుధాకర్‌యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో... ఐ-టీడీపీ నాయకులు, పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా: పలమనేరు స్మశాన వాటికలో కాగడాలతో నిరసన తెలిపారు. రామరాజ్యం లాంటి ఆంధ్రప్రదేశ్‌ని జగన్... రావణకాష్టంలా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, సామూహిక రిలే దీక్షలు చేపట్టారు. టీడీపీ నేత పులివర్తి నాని ఆధ్వర్యంలో కొంగరవారిపల్లె ప్రజలు... సామూహిక రిలే దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే దొరబాబు... దీక్షలకు సంఘీభావం తెలిపారు.
బాపట్ల జిల్లా: అద్దంకిలో 19వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతమాగులూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. బాబుకు మద్దతుగా గుంటూరులో చేపట్టిన 36 గంటల ధర్మానుగ్రహ దీక్షలకు అన్ని వర్గాలు, రాజకీయ నాయకులు సంఘీభావం తెలిపారు. బాబు జైలు నుంచి క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ... తెలుగుదేశం నేత నసీర్ అహ్మద్ గుంటూరు శివారు ప్రగతినగర్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
Live: చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా 'మోత మోగిద్దాం' కార్యక్రమం.. ప్రత్యక్ష ప్రసారం
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేటలో రిలే దీక్షల్లో... టీడీపీ నేతలు నెట్టెం రఘురామ్, శ్రీరాంతాతయ్య పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు రిలే దీక్షల్లో... తూర్పుకాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 19వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో... దివ్యాంగులు చంద్రబాబు చిత్రంతో ఉన్న మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా: మాకవరంలో... బాబుతో నేను కార్యక్రమాన్ని కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖ గాజువాక జంక్షన్‌లో పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలతో వైసీపీ ప్రజలను వేధిస్తోందని గుర్తుచేస్తూ... బ్రిటీషు వారి వేషధారణతో నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి... మహిళలతో కలిసి స్థానిక మోదకొండమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. రంపచోడవరంలో రిలే దీక్షల్లో 11 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.