గుంటూరు జిల్లా గురజాల పరిధిలోని నామ్ ఎక్స్‌ప్రెస్ వే పైకి వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశించారు. ఎక్స్‌ప్రెస్ వే పైకి నీరు రాకుండా చర్యలు, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు నిర్మాణ పనులపై శనివారం కలెక్టరేట్లో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, అర్ అండ్ బీ, నామ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఎక్స్‌ప్రెస్ వే పైకి వరద నీరు రాకుండా కాట్రేడు వాగు అప్, డౌన్ స్ట్రీమ్‌లో కాలువలు వెడల్పు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆ ప్రాంతంలో అండర్ పాస్ డ్రైనేజీ తూముల సామర్థ్యంపై అర్ అండ్ బీ, ఎక్స్‌ప్రెస్ వే ప్రతినిధులతో సమన్వయం చేసుకుని అక్టోబర్ 15 లోగా ప్రతిపాదనలు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వరద నీరు రాకుండాఏం చేయాలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సూచనలు ఇచ్చారు.
మరోవైపు... పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అనుమతులు మంజూరు చేసిన భూముల్లో పనులు ప్రారంభించాలని, అవసరమైన ఇతర భూమిని త్వరలోనే అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. పిడుగురాళ్ల వద్ద ఎక్స్‌ప్రెస్ వే బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని 2021 దసరా నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు.