న్యాయస్థానాలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కోర్టులని, న్యాయమూర్తులను ఉద్దేశించి రవీంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను జత చేశారు. ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని లక్ష్మీనారాయణ తన లేఖలో అభిప్రాయపడ్డారు.
కోర్టులను ఇటీవలి కాలంలో ప్రణాళికాబద్ధంగా విమర్శిస్తూ.. న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు పని చేస్తున్నారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు. న్యాయ వ్యవస్థను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపైనా లక్ష్మీనారాయణ గతంలో లేఖ రాశారు. హైకోర్టు ఆ ఫిర్యాదుని సుమోటోగా తీసుకుని సీఐడీ విచారణకు ఆదేశించింది. అదే కోవలో ఎమ్మెల్సీ రవీంద్రబాబుపైనా ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చదవండీ... మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు..?: హైకోర్టు