సుబాబుల్ కర్రకు తక్కువ ధర చెల్లిస్తూ.. దళారులు దారుణంగా మోసం చేస్తున్నారంటూ గుంటూరు జిల్లా నాదెండ్లలోని ఎండుగుంపాలెం రైతులు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో వంద మంది రైతులు సొసైటీగా ఏర్పడి.. రాజమండ్రి ఏపీ పేపర్ మిల్లు (ఐటీసీ) అందించిన విత్తనాలతో.. 2వేల ఎకరాల్లో తోటలను పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం సుబాబుల్ కర్ర కొట్టటంతో.. పేపర్ మిల్లు ప్రతినిధులు ముందుగా సుబాబుల్ తోటను పరిశీలించి కొనుగోలుకు అనుమతి ఇస్తున్నారు. అయితే ఇందుకు దళారులను ఏర్పాటు చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
రైతులకు అన్ని ఖర్చులు పోను టన్నుకు రూ.2250 ఇవ్వాల్సి ఉండగా.. అందులో రూ.550 దళారులకు ఇస్తేనే మిగిలిన పంటను కొనుగోలు చేస్తామని బెదిరిస్తున్నట్లు రైతులు తెలిపారు. చేసేదేమీ లేక రైతులు దళారులకు డబ్బులు మూటగట్టి పంటలను అమ్మకానికి పెడుతున్నారు.
రైతులంతా కలిసి జిల్లా కలెక్టర్, నాదెండ్ల తహసీల్దార్‌ను కలిసి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు.. ఏపీ పేపర్ మిల్లు ఒంగోలు ప్రాంతీయ మేనేజర్ బాలకృష్ణను పిలిపించి చర్చించారు. రైతులు చెప్పిన విషయాన్ని పరిశీలించి.. వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాలక్రిష్ణ తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సుబాబుల్ రైతులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉద్రిక్తత.. పోలీసులపై ఇసుక చల్లిన మహిళలు