గుంటూరు జిల్లా బాపట్లలో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ విద్యార్థి కళాశాల భవనం ఎక్కాడు. అధ్యాపకులు వారించి అతన్ని అడ్డుకున్నారు. గడువు ముగిసినందున తమ చేతుల్లో ఏమీ లేదని.. విశ్వవిద్యాలయానికి వెళ్లి ప్రయత్నించాలని ప్రిన్సిపల్ స్వరూప్ చెప్పారు. ఫీజు కట్టించుకోకపోతే పరీక్షలు రాయలేనని.. విద్యా సంవత్సరం నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేశాడు విద్యార్థి. కళాశాల భవనం ఎక్కి దూకబోయాడు. అధ్యాపకులు లిఖేశ్ను వారించి అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకుని పట్టణ ఎస్సై రఫీ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.
విద్యార్థికి ఎస్సై, ప్రిన్సిపల్ కౌన్సెలింగ్ ఇచ్చారు. విషయాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫీజు గడువు పొడిగించాలని కోరతామని ప్రిన్సిపల్ తెలిపారు. తెనాలికి చెందిన కనపర్తి లిఖేశ్ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడు పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. చివరి సంవత్సరం పరీక్ష ఫీజుతో పాటు తప్పిన సబ్జెక్టులు మళ్లీ రాయటానికి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందుకు తుది గడువు నాలుగు రోజుల కిందటే ముగిసింది. రెండు రోజులుగా విద్యార్థి కళాశాలకు వచ్చి ఫీజు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందిని కోరాడు.
ఇదీ చదవండి: సిగరెట్ నిప్పుతో మంటలు అంటుకుని.. గడ్డివాము దగ్ధం