నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు చుట్టూ 2,149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ రిజర్వు సరిహద్దు చుట్టూ జీరో నుంచి 26 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని దీనికిందికి తీసుకొస్తూ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ‘‘దీని పరిధిలోకి కర్నూలు జిల్లా ఆత్మకూరు డివిజన్‌కు చెందిన 7 గ్రామాలు, నంద్యాల డివిజన్‌కు చెందిన 12 గ్రామాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌కు చెందిన 21 గ్రామాలు, గిద్దలూరు డివిజన్‌కు చెందిన 15 గ్రామాలు, గుంటూరు జిల్లాకు చెందిన 31 గ్రామాలు వస్తాయి. రాజీవ్‌గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, గుండ్ల బ్రహ్మేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా దీని పరిధిలోనే ఉంటాయి.
నోటిఫికేషన్‌లో ఏముంది..?
ఈ ప్రాంతంలోని వన్యప్రాణుల భద్రత, గిరిజనుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరిహద్దులను గుర్తించాం. టైగర్ జోన్‌కు ఆనుకొని రక్షిత అడవులు లేకపోతే దాని సరిహద్దుల్లో ఉన్న రెవెన్యూ భూములను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాం. ఆత్మకూరు, మర్కాపురం, గిద్దలూరు, నంద్యాల ఫారెస్ట్ డివిజన్‌ల పరిధిలోకి వచ్చే ఈ టైగర్ రిజర్వు చుట్టుపక్కలున్న వ్యవసాయ పొలాలూ ఎకోసెన్సిటివ్ జోన్‌లోకి వస్తాయి. అయితే రైతుల వ్యవసాయ పనులపై ఎలాంటి ఆంక్షలు విధించబోం. అటవీ ప్రాంతం బయట ఉండే రెవెన్యూ భూముల్లో చేసుకొనే సంప్రదాయ జీవనోపాధులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ పరిశ్రమలు, వాటి కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది.
రెండేళ్లలోపు రాష్ట్ర ప్రభుత్వం ఎకోసెన్సిటివ్ జోన్ కోసం జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించి, అధికారికంగా నోటిఫికేషన్ వెలువరించాలి. స్థానిక ప్రజలతో సంప్రదించి దీన్ని తయారుచేయాలి. మాస్టర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు అడవులు, ఉద్యానవనాలు, వ్యవసాయ భూములు, పార్కులు, వినోదం కోసం వదిలేసిన ఖాళీ స్థలాలను వాణిజ్య, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం మార్చడానికి వీల్లేదు. ఇక్కడ వాణిజ్య మైనింగ్, స్టోన్ క్వారీయింగ్, క్రషింగ్ యూనిట్లు, భారీ జల విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు నిషిద్ధం’’ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి : Chandrababu Delhi Tour: సోమవారం దిల్లీకి చంద్రబాబు.. రాష్ట్రపతి సమయం ఖరారు