చెత్త సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు గ్రామీణ మండలం ఓబులనాయుడుపాలెంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను జిందాల్ సంస్థ ఏర్పాటు చేసింది. 2016లో నిర్మాణం ప్రారంభమవగా ఇటీవలే పనులు పూర్తయ్యాయి. గుంటూరు, విజయవాడ మాత్రమే కాక ఏడు మున్సిపాలిటీల్లో పోగయ్యే చెత్తను ఇక్కడికి తరలించి విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ప్రణాళిక. ప్లాంట్‌కు అవసరమైన నీటిని వెంగలాయపాలెం చెరువు నుంచి ఇస్తామని జిందాల్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కృష్ణా కాలువ నుంచి నీటిని తీసుకోవడం ప్రారంభించక ముందు గుంటూరు నగర అవసరాలకు వెంగలాయపాలెం నుంచే నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేవారు. ఆ తర్వాత వెంగలాయపాలెం గ్రామస్థులు వినియోగించుకునేందుకు కార్పొరేషన్ అంగీకరించింది. ఇప్పుడు రోజుకు లక్షన్నర లీటర్ల చొప్పున చెరువులో నీటిని జిందాల్ సంస్థకు కేటాయించడాన్ని గ్రామస్థులు తప్పుపడుతున్నారు.
నీరు అడిగితే కేసులు..
తమ అవసరాలు తీరాకే ప్లాంట్‌కు నీరివ్వాలంటూ.. పైప్‌లైన్ పనులకు వచ్చిన జిందాల్ ప్రతినిధులను గ్రామస్థులు అడ్డుకున్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీరు అడిగితే కేసులు పెట్టడమేంటని గ్రామస్థులు ఆగ్రహిస్తున్నారు.
సరిపడా నీరు అందిస్తాం..
నాలుగైదు రోజులుగా గ్రామస్థులు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియచేస్తున్నారు. చెరువుకట్టపై బైఠాయించారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయితే.. నీటి ప్లాంట్ కార్పొరేషన్‌కు చెందినదని.. తమ హక్కుగా వెంగలాయపాలెం వాసులు భావించడం సరికాదని అధికారులు అంటున్నారు. గ్రామానికి సరిపడా నీరు సరఫరా చేస్తున్నామని.. 3 అంగుళాల పైప్‌లైన్‌ను 6 అంగుళాలకు పెంచుతామని మున్సిపల్ కమిషనర్ అనురాధ హామీ ఇచ్చారు. 2020లో గ్రామసభలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: