"తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిన గుంటూరు పశ్చిమ ఎమ్మార్వో తాత మోహనరావుపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని సామాజిక కార్యకర్త వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉండే హిమబిందు అనే బ్రాహ్మణ మహిళకు ఎమ్మార్వో తాత మోహనరావు.. ఎస్సీ మాల అని కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు సామజిక కార్యకర్త వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎస్సీ సర్టిఫికెట్ సాయంతో ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు.. ఎస్సీ లకు వచ్చే పలు సంక్షేమ పథకాలు పొందినట్లు చెప్పారు. బ్రాహ్మణ మహిళకు, ఎస్సీ అని ఎలా కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేశారని.. ఎమ్మార్వోని అడిగితే తనను కులం పేరుతో దూషించడాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై 2020 ఆగస్టులో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఫిర్యాదు చేయగా వారు.. జిల్లా కలెక్టర్ కి పంపించి విచారణ జరిపించాలన్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ దానిని ఎస్పీకి పంపించారని తెలిపారు. అయితే ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా విచారణ జరగలేదని.. ఎమ్మార్వో మీద ఫిర్యాదు చేసినందుకు అతను తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మార్వో నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలంటూ.. సోమవారం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. ఆ ఎమ్మార్వోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
'నష్టాలు ఉక్కు పరిశ్రమతో కాదు.. ప్రపంచ వ్యాప్త పరిణామాలతోనే..'