Secunderabad Riots Case Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో మరో ఆరుగురు నిందితులను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న మరికొందరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. భారత సైన్యంలో ఎంపికకు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా.. ఈ ఏడాది జూన్ 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి దూసుకొచ్చిన నిరసనకారులు బీభత్సం సృష్టించారు. భారీగా ఆస్తినష్టం కలిగించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా పది మంది గాయపడ్డారు.
విధ్వంసంపై దర్యాప్తునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 81 మందిపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ దఫాలుగా 66 మందిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అనంతరం వారందరూ బెయిల్‌పై బయటికొచ్చారు. తాజాగా అరెస్ట్ చేసిన వారిలో వికారాబాద్‌కు చెందిన డి.మహేశ్, వి.మల్లికార్జున్, వరంగల్‌కు చెందిన ఏ.కుమార్, మహబూబాబాద్‌కు చెందిన ఎల్.వినయ్, మహబూబ్‌నగర్‌కు చెందిన జె.శ్రీకాంత్, కర్నూలుకు చెందిన ఇ.జగన్నాథ్ ఉన్నారు.
ఇవీ చూడండి..