మద్యానికి బానిసై ఆస్తి ఇవ్వమని తల్లిని వేధిస్తున్నాడనే కారణంతో అన్నను చెల్లెలు హతమార్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక శివారు రేగులగడ్డకు చెందిన గుంజి నాగమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు పోతురాజు, ఆదిలక్ష్మి ఇద్దరు సంతానం. వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. పోతురాజు మద్యం తాగుతున్నాడనే కారణంతో అతని భార్య దూరంగా ఉంటోంది. ఇక ఆదిలక్ష్మి వివిధ కారణాలతో భర్త నుంచి దూరమై కొన్నేళ్లుగా తల్లి వద్ద ఉంటోంది.
ఈ క్రమంలో పోతురాజు మద్యం తాగి రోజూ తల్లిని, చెల్లెలును ఇబ్బంది పెడుతున్నాడు. కొద్దిరోజులుగా ఆస్తి రాసివ్వమని తల్లి నాగమ్మను వేధిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మద్యం తాగొచ్చి తల్లితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఆమెపై చేయి చేసుకోబోయాడు... ఇదంతా చూసిన ఆదిలక్ష్మి.. తల్లిని ఏం చేస్తాడోననే భయంతో పక్కనే ఉన్న రోకలిబండతో పోతురాజు తలపై కొట్టింది. దీనితో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి...