గుంటూరు జిల్లాలో సుమారు 400 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు పున: ప్రారంభమయ్యాయి. ఇకపై పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజు... 9వ తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు జరగనున్నాయి. పాఠశాలకు రావడం, రాకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టానికే విడిచిపెట్టారు. వారి అనుమతి తీసుకున్నాకే తొలిదశలో 9, 10 తరగతుల విద్యార్థులను తరగతుల్లోకి అనుమతించారు. పాఠశాలకు వచ్చిన వెంటనే ముందస్తు పరీక్షలు నిర్వహించారు.
తరగతి గదుల్లోనూ కొవిడ్ నిబంధనలను అనుసరించి ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. విధిగా మాస్కుతోపాటు ఆరు అడుగుల దూరం పాటించేటట్లు చర్యలు తీసుకున్నారు. తొలిరోజు పిల్లలతోపాటు తల్లిదండ్రులు పాఠశాలలకు హాజరయ్యారు. పిల్లలకు ఇళ్ల వద్ద ఇప్పటికే కొవిడ్ నివారణ జాగ్రత్తలపై అవగాహన కల్పించామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఆయా వార్డుల పరిధిలోని విద్యా కార్యదర్శులు పాఠశాలలకు హాజరై పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను కొలిచేందుకు థర్మల్ స్కానర్లు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఇవి ఏర్పాటు కాలేదు. పీడీ అకౌంట్లు లేక స్కూలు గ్రాంటు రాక మున్సిపల్ పాఠశాలల్లో అక్కడి ఉపాధ్యాయులే సొంత సొమ్మును ముందుగా వెచ్చించి వీటిని ఏర్పాటు చేశారు.
పాఠశాలలను పరిశీలించిన మున్సిపల్ కమీషనర్
నరసరావుపేటలో పాఠశాలలను అధికారులు పునఃప్రారంభించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పరిశీలించారు. పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్, కాసు బ్రహ్మానందరెడ్డి హైస్కూల్లోని తరగతి గదులను పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. విద్యార్థులు సామాజికదూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలన్నారు. మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కొవిడ్ సోకితే విద్యార్థులు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. కోలుకున్న తరువాతే పాఠశాలకు హాజరు కావాలన్నారు.
ఇదీచదవండి