Sadar celebrations in Hyderabad: సదర్ వచ్చేసింది..! దీపావళి మరుసటి రోజు జరిగే ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. డప్పు చప్పులు, యువత నృత్యాల నడుమ.. దున్నరాజుల విన్యాసాలు సందడే వేరు. దీపావళి మరుసటి రోజు నిర్వహించే ఈ వేడుక కోసం ఈసారీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్‌కు చెందిన దూద్వాల నిర్వాహకుడు మధుయాదవ్ ఆధ్వర్యంలో.. బడా గణేష్ విగ్రహం ముందు మున్సిపల్ మైదానంలో దున్నరాజుల ప్రదర్శన నిర్వహించారు.
మధు యాదవ్ 10 దున్నలను కొనుగోలు చేసి తన డైరీ ఫామ్ లో పోషిస్తున్నారు. నేషనల్ ఛాంపియన్‌షిఫ్‌లో గెలిచిన సుల్తాన్ రాజు దున్నకు పుట్టిన రానా దూడ, అదే విధంగా షారుక్ , లవ్ రాణా, షేర్ ఖాన్ ఆస్ట్రేలియా జాతి కట్టప్ప, గరుడ రాఖీ, పంజాబ్, హర్యానాలకు చెందిన దున్నరాజులు సదర్ వేడుకల్లో విన్యాసాలు చేయనున్నాయి.
గరుడ దున్న ప్రత్యేకత: ఈనెల 26న ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద, 27న నారాయణగూడలో జరిగే వేడుకల్లో గరుడ, లవ్ రానా, షారుక్ దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మధు యాదవ్ తెలిపారు. ఈసారి సదర్ వేడుకల్లో 35కోట్ల విలువైన గరుడా దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూడేళ్ల వయస్సులో కొనుగోలు చేసిన వృషభరాజం.. 18వందల54 కిలోల బరువు.. పొడవు ఏడు అడుగులు ఉంది.
దున్నపోతులకు పెట్టే ఆహారం ఓ ప్రత్యేకత: ఈ దున్నరాజు విలువ తగ్గట్టే ఆహారంలో ప్రత్యేక మెనూను పాటిస్తున్నారు. ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్ల పాలతోపాటు.. పిస్తా, బాదం, కాజు, యాపిల్స్ అందిస్తున్నారు. సాయంత్రం 40కోడిగుడ్లు పెడుతున్నామని.. సాధారణ రోజుల్లో రోజుకు 7 నుంచి 8 వేల ఖర్చు అయితే.. సదర్ ఉత్సవాల సమయంలో రోజుకు 10 వేల ఖర్చు అవుతోందని నిర్వాహకులు తెలిపారు.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నువ్వులనూనెతో మసాజ్ చేయించడంతో పాటు.. ఉదయం నడకకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా రెండేళ్లుగా వేడుకలు సాదాసీదాగా జరిగితే .. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: