Anarchy of ruling party leaders : గుంటూరు నగరంలో కేబుల్ వైర్ల కత్తిరింపు వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. కరెంటు స్తంభాల పైనుంచి వేసుకున్న తీగల్ని విద్యుత్ శాఖ అధికారులు కత్తిరించటంతో వివాదం మొదలైంది. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వైర్లు తొలగిస్తున్నారని కేబుల్ టీవి ఆపరేటర్లు ఆరోపించటం కలకలం రేపింది. పైగా వైర్లు కత్తిరించిన చోట మళ్లీ అతికిద్దామని వెళ్తే పోలీసు కేసులు పెడుతున్నారు. దీంతో ఆపరేటర్లంతా కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇసుక, మట్టి, భూమాఫియాకు తోడు ఇప్పుడు అధికార పార్టీ నేతలు కేబుల్ మాఫియా అవతారమెత్తి ఆపరేటర్లను బెదిరిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.
మాట వినకుంటే పోలీసు కేసులు.. గుంటూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కేబుల్స్ ను విద్యుత్ శాఖ సిబ్బంది ఎక్కడికక్కడ కత్తిరించేస్తున్నారు. కరెంటు స్తంభాల పైనుంచి ఇలా తీగలు లాక్కోవటానికి కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు విద్యుత్ శాఖకు పోల్ ట్యాక్స్ చెల్లిస్తారు. పన్ను చెల్లించినప్పటికీ ఇలా వైర్లు కత్తిరిస్తున్నారు. అయితే ఈ కత్తిరింపు వ్యవహారం కొందరు ఆపరేటర్లకు చెందిన కేబుల్స్ కు మాత్రమే పరిమితం కావటం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా సిటీ కేబుల్ ఆపరేటర్లకు చెందిన తీగల్ని కత్తిరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే.. గుంటూరు నగరంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేబుల్ టీవీ వ్యాపారంలో ఉన్నారు. అందరు ఆపరేటర్లు తమ నుంచే కనెక్షన్ తీసుకోవాలని వారి నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దానికి అంగీకరించని ఆపరేటర్ల కేబుల్స్ మాత్రమే తొలగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇపుడీ వ్యవహారంలో కేబుల్ ఆపరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం మరింత వివాదాస్పదమైంది. విద్యుత్ శాఖ అధికారులు అడ్డగోలుగా కత్తిరించి పడేసిన కేబుల్స్ ను మరమ్మతు చేయటానికి వెళ్లిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. దీంతో ఆపరేటర్లు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. కేబుల్స్ కత్తిరింపు వ్యవహారంపై ఆపరేటర్లు హైకోర్టుని కూడా ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మొత్తంగా అధికార పార్టీ నేతల వైఖరితో గుంటూరు జిల్లాలో ప్రజలు కేబుల్ ప్రసారాలు చూడలేని పరిస్థితి ఏర్పడింది.
మేం డిపార్ట్మెంట్కి వ్యతిరేకం కాదు.. ఎవరైనా సరే ప్రజలకు అసౌకర్యం కలిగించడం సరి కాదు. కాకపోతే ఒక సిటీ కేబుల్ సంస్థకు చెందిన వైర్లు మాత్రమే వెతికి మరీ కట్ చేయించడం పద్ధతి కాదు. వేరే సంస్థ కోసం పోటీలో ఉన్న సిటీ కేబుల్ ఆపరేటర్లను దెబ్బకొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. - గాంధీ చౌదరి, కేబుల్ ఆపరేటర్
ప్రత్యేకించి సిటీ కేబుల్ నెట్‌వర్క్‌కు చెందిన చెందిన వైర్లు మాత్రమే కట్ చేయడం.. ఇదే విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు బహిరంగంగా చెప్పడం శోచనీయం. నేను వైసీపీ నాయకుడిని అయ్యి ఉండి కూడా.. 27 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్‌లో ఉండి ఇవాళ బాధతో ముందుకు రావాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టడం దారుణం. - అన్నపురెడ్డి, కేబుల్ ఆపరేటర్
నిలిచిపోయిన ప్రసారాలు.. నగరంలో నాలుగైదు రోజులుగా కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. పరీక్షల సీజన్లో ఇంటర్నెట్ సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ నేతలు తమ దోపిడీకి కేబుల్ వ్యవస్థను వాడుకోవాలని చూడటం వల్లే సమస్య వచ్చిందని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతి రంగంలోనూ దోచుకోవాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. కేబుల్ ఆపరేటర్ల పొట్టగొడుతున్నారని, అదే సమయంలో ప్రజలకు సైతం ఇబ్బందులు కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు కేబుల్స్ కత్తిరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే విద్యుత్ శాఖ అధికారుల వాదన మరోలా ఉంది. కరెంటు స్తంభాలపై కట్టలు కట్టలుగా తీగలు పేరుకుపోవటం వల్లే వాటిని కత్తిరిస్తున్నామని వివరణ ఇస్తున్నారు.
కోర్టును ఆశ్రయించిన బాధితులు... కేబుల్స్ కత్తిరింపు వ్యవహారంపై ఆపరేటర్లు హైకోర్టుని కూడా ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మొత్తంగా అధికార పార్టీ నేతల వైఖరితో గుంటూరు జిల్లాలో ప్రజలు కేబుల్ ప్రసారాలు చూడలేని పరిస్థితి ఏర్పడింది.
ఒక గజదొంగ లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు. ఒక చిల్లర దొంగ ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. ఒక జేబు దొంగ కేబుల్ వ్యాపారంలో రావాలనే ఆలోచనతో విద్యుత్ శాఖ అధికారులను, ప్రభుత్వాన్ని వాడుకుని వైర్లను కట్ చేస్తున్నారు. - నసీర్ అహ్మద్, టీడీపీ అధికార ప్రతినిధి
మేయర్, డిప్యూటీ మేయర్, ఇద్దరు ఎమ్మెల్యేలు కేబుల్ వ్యాపారంలో ఉన్నారని ప్రజలు చెప్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఏర్పడిన సిటీ కేబుల్ వ్యవస్థను ఇష్టానుసారంగా వైర్లు కట్ చేసేసి మూడు రోజులకు పైగా ప్రసారాలు నిలిపేయించారు. మీరు ప్రజా ప్రతినిధులా ... ప్రజల మీద బతుకుదామని వచ్చిన రాబంధులా..? - గాదె వెంకటేశ్వరరావు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు
విద్యుత్ స్తంభాలపై కట్టలు కట్టలుగా పేరుకున్న వైర్లు తొలగించాలని మేం ఆదేశాలు ఇచ్చాం. మనిషిని పెట్టుకుని మరీ తొలగిస్తున్నారని, అవన్నీ ఒకే సంస్థకు చెందినవని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. - మురళీకృష్ణ, విద్యుత్ శాఖ ఎస్ఈ, గుంటూరు జిల్లా
ఇవీ చదవండి :