RTC Employees Protest Against Kavali Attack Incident: నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ.. ఆర్టీసీ డీపోల వద్ద ఎంప్లాయిస్ యానియన్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. డ్రైవర్‌పై వైసీపీ మూకలు రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి ఘటనతో విధులకు రావాలంటేనే భయపడుతున్నామని అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు జరగకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కఠిన శిక్షలు విధించి ధైర్యాన్నివ్వాలని కోరుతున్నారు.
నెల్లూరు జిల్లాలో ఆందోళన: నెల్లూరు ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎన్ఎంయూ ఆందోళన చేపట్టింది. ప్రజలకు సేవలు అందించే కార్మికులపై దాడులు చేస్తే ఏ విధంగా ఉద్యోగం చేస్తామని ప్రశ్నించారు. ఆర్టీసీ సిబ్బందికి రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరించారు.
మన్యం జిల్లాలో: డ్రైవర్‌పై దాడిని నిరసిస్తూ.. మన్యం జిల్లా కమిటీ సాలూరు మండలం మామిడిపల్లి ముంగారమ్మ తల్లి ఆటో వర్కర్స్ యూనియన్ ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించి రవాణా రంగంలో సేవలందిస్తున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి యువత ,ఆటో డ్రైవర్లు, ప్రజలు, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు.
ఉరవకొండలో: కావలిలో జరిగిన దాడికి నిరసనగా అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు హెచ్చరించారు.
కడప ఆర్టీసీ డిపో ఎదుట నిరసన: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కడప ఆర్టీసీ డిపో ఎదుట అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో నల్ల పట్టీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు బస్సును ఆపి డ్రైవర్ను కిందికి దించి విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేయడం దారుణమని ఖండించారు. ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనపై సోమవారం నెల్లూరు జిల్లా ఎస్పీని కలెక్టర్లు కలిసి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు.
నంద్యాలలో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలంటూ నంద్యాలలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యోగులంతా సంఘటితంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బాపట్లలో నల్ల బ్యాడ్జీలతో నిరసన: బాపట్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవటం బాధాకరమన్నారు. నిందితులందరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వేధింపులకు వ్యతిరేకంగా కదిలిన ఆర్టీసీ ఉద్యోగులు.. సమ్మెకు సిద్ధమని హెచ్చరిక