మట్టి రోడ్డుపై మామూలుగా వెళ్లాలంటేనే ఎన్నో ఇబ్బందులు. అలాంటి మట్టిరోడ్డుపై అడుగడుగునా గుంతలు దర్శనమిస్తే. ఆ రోడ్లపైకి వర్షపు నీరు చేరితే. అచ్చం ఇలాగే ఉంటుందేమో. కిలోమీటరు దూరం సంగతి పక్కన పెడితే. కదిలే ఒక్కో మీటరు దూరం ప్రయాణమే నరకప్రాయం. అలాంటి దుర్భర పరిస్థితిని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు గుంటూరు జిల్లాలోని ఆ మూడు గ్రామాల ప్రజలు. అచ్చంపేట మండలంలోని మాడిపాడు, జడపల్లి తాండా, కంచుబోడు తండా వాసులు దశాబ్దాలుగా ఈ గుంతల రోడ్లపైనే ప్రయాణిస్తున్నారు. కాలినడక నుంచి కార్లు తిరిగే స్థాయికి ఎదిగినా.. ఆ ఊరి దారులు మాత్రం ఇంకా ఎడ్లబండ్ల స్థాయిలోనే మిగిలిపోయాయి. గుంతల రోడ్లపై ఒళ్లు హూనం చేసుకుంటూ దుమ్మురేగే మట్టిరోడ్డపై వారు ప్రయాణం సాగించాల్సిందే. ఎడారిలో ఒయాసిస్సులా ఆ గ్రామాలకు సమీపంలోనే 15 ఏళ్ల కిందట పులిచింతల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగింది. తమకోసం కాకపోయినా ప్రాజెక్ట్ కోసమైనా రోడ్లకు మరమ్మతులు చేస్తారని ఆశించినా...నిరాశే ఎదురైంది. పైగా ప్రాజెక్ట్ పనులతో ఆ గ్రామాలకు వెళ్లే రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి.
పులిచింతల ప్రాజెక్ట్ పూర్తయ్యింది కానీ ఆ గ్రామాల రహదారుల మరమ్మతులకు మాత్రం నోచుకోలేదు. పైగా ప్రాజెక్ట్‌ను చూసేందుకు వచ్చే పర్యాటకుల నుంచి అధికారులు, సిబ్బంది వరకు అందరూ ఇదే దారిలో వాహనాలపై వెళ్తుండటంతో రోడ్లు మరింత పాడైపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్లపై ప్రయాణం సాహసమే.
రహదారుల మరమ్మతుల గురించి ఎంతమందికి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. పులిచింతల ప్రాజెక్టు పెండిగ్ పనుల్లో భాగంగా రోడ్డు నిర్మాణం కోసం కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి నిధులు మంజూరు చేయాల్సి ఉంది.
ఇదీ చదవండి : నలుగురు పిల్లలకు విషమిచ్చి..ఆపై తానూ సేవించిన తల్లి