గుంటూరు నగరంలో రోజురోజుకి వేగంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. చెన్నై నగరానికి చెందిన డాక్టర్ నంద గోపాల్ రూపొందించిన.. తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడ్వయిజరి కమిటీ మెంబర్ డాక్టర్ యస్.సురేష్ కుమార్ అమోదించిన "రివల్యూషన్" సేంద్రీయ క్రిమి సంహారక రసాయన పని తీరుని కమిషనర్ పరిశీలించారు.
గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షంగా దానిని పరిశీలించి.. పనితీరును అడిగి తెలుసుకున్నారు. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన "రివల్యూషన్" సేంద్రీయ క్రిమి సంహారక రసాయనం ఘాటైన వాసన లేకుండా.. పిచికారి చేసిన తర్వాత సుమారు 6 గంటల పాటు ప్రభావాన్ని చూపుతుందన్నారు. 1 లీటర్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయవచ్చన్నారు. ఈ ద్రావణాన్ని ప్రధానంగా నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్, మార్కెట్ జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన చేయాలని ప్రజారోగ్య అధికార్లను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.భాగ్యలక్ష్మి, సిటీ ప్లానర్ సునీత, యస్.యస్ రాంబాబు, లోక్ సత్తా జిల్లా కన్వీనర్ కె.సూర్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి కారు-ద్విచక్రవాహనం ఢీ.. బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా