Retired IAS EAS Sharma Letter to CM Jagan: ఖరీదైన స్మార్ట్ మీటర్లను ఉపయోగించడం వలన వచ్చే భారాన్ని విద్యుత్ వినియోగదారుల మీద మోపడం సబబు కాదని విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ప్రైవేటు( అదానీ) కంపెనీల నుంచి మీటర్లు కొని రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల ఇళ్లల్లో బలవంతంగా ఇన్స్టాల్ చేసే ప్రణాళిక వలన, ప్రైవేటు కంపెనీలకు అధికంగా లాభాలు కలుగుతాయి కాని, వినియోగదారులు నష్టపోతారన్నారు. మార్చ్8న రాసిన లేఖలో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చినట్టు వివరించారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అదానీ కంపెనీ ఇచ్చే మీటర్ ధర 14వేల 266 రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ (RDSS) పథకం కింద సూచించిన మీటర్ ధర 6వేల రూపాయలని.. ఈ రెండు ధరలకు తేడా 8వేల 266 రూపాయలని లేఖలో స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ సంస్థల టెండర్లో అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ ధర 10వేల రూపాయలు ప్రకటించగా, అక్కడి ప్రభుత్వ సంస్థలు ఆర్డర్ ఇవ్వడానికి తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల ఇక్కడా ఆ ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరారు.
అదానీ వద్ద నుంచి కొనే స్మార్ట్ మీటర్లు అత్యాధునికమైన 5జీ టెక్నాలజీకి అనుగుణంగా పని చేయవని తాను తెలుసుకున్నానని, అటువంటి పాత టెక్నాలజీ స్మార్ట్ మీటర్లను పెద్ద ఎత్తున కొనడం తప్పుడు నిర్ణయమన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారులను మభ్యపెట్టి ప్రభుత్వం తొందరలో అదానీ కంపెనీకి అంత పెద్ద స్మార్ట్ మీటర్ల ఆర్డర్ ఇవ్వడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అదానీ కంపెనీకి, నియమాలను అధిగమించి లాభాలను కలిగించిన నిర్ణయాలను తీసుకోవడం గురించి ప్రభుత్వం దృష్టికి తాను తీసుకురావడం జరిగిందని చెప్పారు.
స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఖర్చు చాలా ఎక్కువని, అందుకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు లాభం కలుగుతుందా అనే విషయాన్ని ప్రభుత్వం సరిగ్గా పరిశీలించలేదని ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. యూకేలో దీనిపై సమగ్రంగా అధ్యయనం చేశారని, ఏపీలోనూ అధ్యయనం చేస్తే.. నష్టాలే అధికమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు విన్నానన్నారు. ఈ నివేదికను ప్రభుత్వం ఎందుకో దాచిపెడుతోందని ఆరోపించారు.
టెండర్లు లేకుండా గంగవరం పోర్టులో ప్రభుత్వం 11% షేరును అతి తక్కువ ధరకు అమ్మడం, కృష్ణపట్నం పోర్టు అదాని కంపెనీ చేతిలోకి పోవడానికి ప్రభుత్వం దోహదం చేయడం, టెండర్లు పిలవకుండా ఆ కంపెనీకి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఇవ్వడం, విశాఖలో వందల ఎకరాల అతి విలువయిన ప్రభుత్వ భూమిని చౌక ధరకు ఇవ్వడం, ఇందుకు ఉదాహరణలుగా వివరించారు. ప్రభుత్వం అదానీకి ఇవ్వదలచిన స్మార్ట్ మీటర్ల ఆర్డర్‌ను వెంటనే ఉపసంహరించాలని కోరారు.
ఇవీ చదవండి:
- CBN Fires on CM Jagan: రాష్ట్రంలో కేంద్రీకృత అవినీతికి జగన్ రారాజు.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి:చంద్రబాబు
- Illegal Mining in Kolleru: కొల్లేరు సరస్సుకు తప్పని గర్భశోకం.. వైసీపీ నాయకుల అండతోనే విధ్వంసం..!
- power cuttings in AP : కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో..! రాష్ట్రంలో అనధికారిక విద్యుత్ కోతలు