ఆంధ్రప్రదేశ్‌లోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జిల్లా కలెక్టర్ల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈసీకి వివరాలు పంపించామన్నారు. రీపోలింగ్ కోసం సిఫార్సు చేసిన 5 కేంద్రాల పేర్లను బుధవారం ఆయన వెల్లడించారు.
రీ పోలింగ్‌కు సిఫార్సు చేసిన కేంద్రాలు
* నరసరావుపేట నియోజకవర్గ పరిధి కేసనపల్లిలోని 94వ నంబరు పోలింగ్ కేంద్రం
* గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ నంబరు పోలింగ్ కేంద్రం
* కోవూరు నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ కేంద్రం
* సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రం
* ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి కలనూతలలోని 247వ పోలింగ్ కేంద్రం
ఇబ్బందులపై నివేదికకు ఆదేశాలు
ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన ఇబ్బందులపై తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈవీఎంలు ఎక్కడెక్కడ మొరాయించాయి? ఏయే పోలింగ్ కేంద్రాల్లో సమయం ముగిశాక పోలింగ్ కొనసాగించారు, అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? వాటికి బాధ్యులెవరు?.. తదితర అంశాలపై నివేదిక పంపించాలన్నారు.
12 మంది అధికారులపై చర్యలు
నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున బెల్ ఇంజినీర్లు, ఈసీఐఎల్ నిపుణుల్ని కేటాయించినా వారి సేవలను ఎందుకు వినియోగించుకోలేదో సమాధానం చెప్పాలని కలెక్టర్లను ద్వివేది ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో సాంకేతిక నిపుణులకు మార్గసూచీలు ఎందుకు ఇవ్వలేదో బదులివ్వాలన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ద్వివేది హెచ్చరించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చూపిన 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసిన 12 గంటల తర్వాత ఈవీఎంలను రిటర్నింగ్ అధికారి స్ట్రాంగ్ రూమ్‌కు అప్పగించారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆ జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరగా.. అది ఆవాస్తవమంటూ ఆయన నివేదిక పంపించారని ద్వివేది తెలిపారు.